Headlines

Watch: శివాలయంలో దొంగల బరితెగింపు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు రికార్డ్!


మీరట్: దేవుడి గుడిలోనూ దొంగలు బరితెగించారు. అర్ధరాత్రి వేళ శివాలయంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు నగదు, పూజా సామగ్రితో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. చివరకు శివలింగంపై ఉండే నాగదేవత విగ్రహాన్ని సైతం వదలకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశం

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 16, సోమవారం రాత్రి ఇద్దరు దొంగలు ముఖాలకు ముసుగులు ధరించి మీరట్‌లోని ఓ శివాలయంలోకి ప్రవేశించారు. ముందుగా ఆలయ ప్రధాన ద్వారం తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా సేకరించి దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ పెట్టెను సైతం పగలగొట్టి అందులోని నగదును తీసుకెళ్లారు. దొంగిలించిన వస్తువుల్లో పవిత్ర కలశం, శివలింగంపై అలంకరించిన నాగదేవత విగ్రహం, ఇత్తడి పళ్లాలు, దీపాలు, ఇతర పూజా సామగ్రితో పాటు ఇన్వర్టర్, బ్యాటరీ ఉన్నాయి. మైక్రోఫోన్లు తొలగించిన యాంప్లిఫైయర్‌ను కూడా అక్కడే వదిలేసినట్లు గుర్తించారు.

ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులకు షాక్!

మంగళవారం ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం తాళం పగిలి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. ఆలయాన్ని చూసుకునే స్థానిక నివాసి సంతోష్ కుమార్ సక్సేనా అక్కడికి చేరుకుని పరిశీలించారు. లోపల లైట్లన్నీ ఆపివేసి ఉండటంతో మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ సాయంతో ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలు వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించారు.

CCTVలో దొంగల బాగోతం.. వీడియో వైరల్

ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, దుప్పట్లతో శరీరాలను కప్పుకున్న ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. వారు పూజా వస్తువులను సేకరించి, నగదు సహా ఇతర సామగ్రిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు ఫుటేజీలో నమోదైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ.40 వేల వరకు నష్టం.. పోలీసుల దర్యాప్తు

దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుందని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయంలోకి చొరబడి హుండీ సొమ్ముతో పాటు పవిత్ర పూజా వస్తువులను కూడా దొంగిలించడం స్థానికంగా కలకలం రేపింది. భక్తులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరగా పట్టుకుని పోయిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *