Headlines

Hyderabad: పెళ్లిళ్లు, శుభకార్యాలు నిర్వహించేవారికి బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలు వచ్చేశాయ్!


సైబరాబాద్ పరిధిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహించేవారికి మున్సిపల్ అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇకపై 100 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలకు నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఒక కార్యక్రమానికి 100 మందికి మించి హాజరైతే కనీసం మూడు రోజుల ముందుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్‌సైట్‌లోని ఈవెంట్ ఇంటిగ్రేషన్ విధానం ద్వారా అనుమతి పొందాలి. ఈ నిబంధనలను అమలు చేయాలని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

భారీగా చెత్తను ఉత్పత్తి చేసే సంస్థలుగా ఇప్పటివరకు కేవలం 250 కంపెనీలు మాత్రమే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద నమోదు చేసుకున్నాయి. దీంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. ప్రతి కంపెనీకి ఈ నిబంధనల గురించి తెలియజేసే బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించింది. ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే మున్సిపాలిటీకి సమాచారం ఇస్తే.. కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఉత్పత్తయ్యే చెత్తను సకాలంలో తొలగించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రోజుకు 100 కిలోలకుపైగా చెత్త ఉత్పత్తి చేసే కేంద్రాలను బల్క్ గార్బేజ్ జనరేటర్లుగా పరిగణిస్తారు. ఆయా సంస్థలు తడి, పొడి, ఇతర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలి. ప్రతి కిలో చెత్తకు సుమారు రూ.3 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో సైబరాబాద్ ప్రధాన రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయడంతోపాటు.. రహదారులకు ఇరువైపులా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కాలిబాటలు నిర్మించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కేవలం ప్రహరీ గోడలతో ఖాళీగా ఉన్న 350 ప్లాట్లను పార్కులుగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం డిజైన్లను సిద్ధం చేసి త్వరలో ఏడీబీకి సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా వరద నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న నాలాలను పునరుద్ధరించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *