అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Special TET)–2026కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించే అవకాశం కల్పించేందుకు ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. అధికారిక ఏపీ టెట్ పోర్టల్‌లో ప్రత్యేక టెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్ష షెడ్యూల్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ టెట్–2026కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 24, 2026 చివరి తేదీగా అధికారిక పోర్టల్‌లో పేర్కొన్నారు. దీంతో అర్హత ఉన్న ఇన్-సర్వీస్ టీచర్లు గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 11 నుంచి పరీక్షలు
ప్రత్యేక టెట్ పరీక్షలను అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో జరుగుతాయి. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలను హాల్‌టికెట్‌లో వెల్లడించనున్నారు. ఈ ప్రత్యేక టెట్ ప్రధానంగా 2011కి ముందు నియమితులైన, టెట్ అర్హత సర్టిఫికెట్ లేని ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్నారు. అప్పట్లో నియామక సమయంలో టెట్ అర్హత తప్పనిసరి కాని ఉపాధ్యాయులకు ప్రస్తుతం టెట్ అర్హత పొందేందుకు అవకాశం కల్పించడమే ప్రత్యేక పరీక్ష ఉద్దేశం. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ అర్హతకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 మే 29న సుప్రీంకోర్టు సంబంధిత రివ్యూ పిటిషన్లపై జోక్యం చేసుకోకపోయినప్పటికీ, రాష్ట్రాలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని టెట్ అర్హత పొందేందుకు గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. అలాగే అర్హులైన ఉపాధ్యాయులకు పరీక్ష రాసే అవకాశాలు కల్పించేందుకు టెట్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ ఏపీ టెట్‌కు అదనంగా ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా 2011కి ముందు నియమితులైన అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత గడువులో టెట్ అర్హత సాధించేందుకు ఈ ప్రత్యేక పరీక్ష ఉపయోగపడనుంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2026
- ప్రత్యేక టెట్ పరీక్షలు: అక్టోబర్ 11–21, 2026
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)