
ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులను సెప్టెంబర్ 25న జమ చేసేందుకు అనుమతించింది. డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాలకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. ఈ మొత్తాన్ని ‘అడ్వాన్స్ పేమెంట్’గా పరిగణిస్తారు. లెక్కలు ఖరారైన తర్వాత అక్టోబర్ చెల్లింపులో మిగతా డబ్బులను సర్దుబాటు చేయనున్నారు. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముందుగానే జీతాలు అందించనుంది. సాధారణంగా నెల చివరి వారంలో లేదా తదుపరి నెల మొదటి వారంలో జీతాలు, పెన్షన్లు అందుకునే వారికి సమ్మె వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేంద్రం ముందస్తు చెల్లింపులకు అనుమతిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25వ తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకుల సమ్మె కారణంగా నగదు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఈ ముందస్తు చెల్లింపుతో ఉద్యోగులు, పెన్షనర్లు తమ రోజువారీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వీలవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోడీ కేబినెట్ కీలక శుభవార్త అందించింది. వారి జీతాలు, పెన్షన్లను పెంచే లక్ష్యంతో ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. ఎనిమిదో పే కమిషన్ తన సిఫార్సులను వచ్చే 18 నెలల వ్యవధిలో సమర్పించనుంది. ఈ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు పెరగనున్నాయి.
ఎనిమిదవ పే కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేసాయి వ్యవహరించనున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్లను కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేంద్ర క్యాబినెట్ రబీ సీజన్ కోసం న్యూట్రియెంట్ ఫర్టిలైజర్ సబ్సిడీకి కూడా ఆమోదం తెలిపింది. ఫాస్ఫేటిక్, పొటాషిక్, డీఏపీ వంటి ఎరువులకు ఈ సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ సబ్సిడీల కోసం కేంద్రం 37,952 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.