వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ కీలక ముందడుగు వేసింది. నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 7.5 కిలోవాట్ల ప్రోటోటైప్ సోలార్ అగ్రికల్చర్ పంప్సెట్ల సింక్రొనైజేషన్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేశారు అధికారులు. స్థానిక ఎర్తింగ్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (DTR) న్యూట్రల్ ఎర్తింగ్ వ్యవస్థలతో వీటిని అనుసంధానించి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి సోలార్ పంప్సెట్ను డీటీఆర్ న్యూట్రల్ ఎర్తింగ్ పద్ధతితో, బొజ్జ కృష్ణారెడ్డి సోలార్ పంప్సెట్ను లోకల్ ఎర్తింగ్ పద్ధతితో పద్ధతిలో అనుసంధానం చేసి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రోటోటైప్ ప్రాజెక్టును రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, నాగర్కర్నూల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకట నరసింహారెడ్డి, డివిజనల్ ఇంజనీర్ ఎం. సుధాకర్ పర్యవేక్షించి, సాంకేతికంగా సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సోలార్ పంప్సెట్లను విద్యుత్ పంపిణీ వ్యవస్థతో సమర్థవంతంగా అనుసంధానం చేయడం ద్వారా రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. సంప్రదాయ విద్యుత్ వినియోగంపై భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సోలార్ ఆధారిత పంప్సెట్ల అమలుకు అవసరమైన సాంకేతిక ప్రమాణాలు, భద్రతా అంశాలు, నిర్వహణ విధానాలపై ఈ ప్రోటోటైప్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. దీనివల్ల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరడమే కాకుండా, విద్యుత్ వ్యవస్థపై భారం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకట నరసింహారెడ్డి పేర్కొన్నారు. సౌరశక్తి ఆధారిత పంప్సెట్లతో వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.