ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దసరా పండుగ కానుకగా కొత్త పింఛన్లను పంపిణీ చేయనుంది. కొత్తగా 3 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను మంజూరు చేయనుంది. కొత్తగా పించన్లు పొందేందుకు దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిశీలన పూర్తి చేయనుండగా.. వారిలో అర్హులైన 3 లక్షల మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేయనున్నారు. అనంతరం వారికి వచ్చే నెలలో రానున్న దసరా పండుగ ముందే పించన్లను పంపిణీ చేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో లేదా చివరి నాటికి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెన్షన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం అత్యంత కఠినమైన పరిశీలన విధానాన్ని అనుసరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు నిజంగానే అర్హులా, వారికి పెన్షన్ అవసరమా, వారు సమర్పించిన పత్రాలు సరైనవా కావా అని అధికారులు క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేస్తున్నారు. గతంలో అనర్హులు సైతం పలుకుబడిని ఉపయోగించి పెన్షన్లు పొందిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి దరఖాస్తుదారుని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన వారికి మాత్రమే పెన్షన్ అందేలా చూస్తున్నారు. నకిలీ పత్రాలు సమర్పించి పెన్షన్లు పొందుతున్న సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది పేర్లను ఇప్పటికే తొలగించారు. నిరుపేద కుటుంబాలు, అత్యవసరంగా ఆర్థిక చేయూత అవసరమైన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కనీసం మూడు పూటలా తినలేని వారు, భూమి లేదా ఇల్లు లేని వారికి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్న వితంతువులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. 2.5 లక్షల మందికి పైగా వితంతువులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వితంతువులకు ఆర్థికంగా అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వృద్ధులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులు వంటి ఇతర వర్గాల నుండి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వీరికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు ఇప్పుడు నెరవేరనున్నాయి. అక్టోబర్ నెలలో వృద్దులు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు అందనుండగా.. దివ్యాంగులకు రూ.6 వేలు అందనున్నాయి.