
భారతీయ రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్లో అత్యాధునిక కవచ్ 4.0 స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థను విజయవంతంగా అమల్లోకి తెచ్చింది. మొట్టమొదటి సారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా ఈ లేటెస్ట్ వెర్షన్-4.0 ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మల్కాజిగిరి నుంచి కామారెడ్డి వరకు గల 108 కిలోమీటర్ల రైల్వే మార్గంలో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే SCR పరిధిలో అమలు చేసిన మునుపటి వెర్షన్ల అనుభవాలను క్రోడీకరించి, మరింత కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ సిగ్నలింగ్ సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారు.
కవచ్ 4.0 ప్రత్యేకతలు- ప్రయోజనాలు
అత్యాధునిక కవచ్ 4.0 స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థను ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది..ఒకవేళ లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లినా లేదా నిర్ణీత వేగపరిమితిని దాటినా, ఈ వ్యవస్థ వెంటనే అప్రమత్తమై ఆటోమేటిక్ గా బ్రేకులు వేస్తుంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ముప్పును తగ్గించడంలో, ముఖ్యంగా ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురెదురుగా వచ్చే ప్రమాదాలను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది.
ప్రతికూల వాతావరణం దట్టమైన పొగమంచు లేదా భారీ వర్షాలు వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ రైళ్లు సురక్షితంగా రాకపోకలు సాగించేలా సాంకేతిక సహకారం అందిస్తుంది. అధునాతన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్, ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్స్‌తో ఇది అనుసంధానించబడి ఉంటుంది.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వే మార్గాల్లోనూ ఈ కవచ్ 4.0 వ్యవస్థను విస్తరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.