పంచదార వాడకుండా బెల్లంతో చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో శ్రేయస్కరం. నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ అశోకా హల్వాను ఇంట్లో ఉండే తక్కువ దినుసులతో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ అశోకా హల్వా తయారీకి ముందుగా అర కప్పు పెసరపప్పును నీటితో శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వంచేయాలి.
మందపాటి గిన్నెలో ఈ పెసరపప్పును వేసి సన్నటి మంటపై కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. పప్పు వేగిన తర్వాత ఒకటి కి నాలుగు (1:4) వంతుల చొప్పున రెండు కప్పుల వేడి నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పుగుత్తితో బాగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్రలో అర కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి పక్కన ఉంచాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఆ తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే నేతిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి సన్నటి మంటపై కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. పిండి వేగిన తర్వాత మెదిపి ఉంచిన పెసరపప్పు ముద్దను అందులో వేసి సన్నటి మంటపై కలుపుతూ 15 నిమిషాలు వేయించాలి.
పప్పు మంచి రంగులోకి మారిన తర్వాత ఉడికించిన బెల్లం నీటిని వడగట్టి పోసి దగ్గరపడే వరకు కలపాలి. మిశ్రమం దగ్గరపడి బాండీ నుండి విడివడుతున్న సమయంలో పావు టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు తినే కర్పూరం మరియు వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలిపి దింపేయాలి. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ అశోకా హల్వా తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.




