Headlines

హిప్పో Vs రైనో.. రెండింటీ మధ్య ఫైట్ జరిగితే గెలుపు ఎవరిది..?

హిప్పో Vs రైనో..  రెండింటీ మధ్య ఫైట్ జరిగితే గెలుపు ఎవరిది..?


అడవిలో సింహం, పులి మాత్రమే కాదు.. హిప్పో (నీటి గుర్రం), రైనో (ఖడ్గమృగం) కూడా అత్యంత ప్రమాదకరమైన జంతువుల జాబితాలో ఉంటాయి. ఒకటి తన భారీ దవడలతో శత్రువును చీల్చేస్తే.. మరొకటి తన పదునైన కొమ్ముతో ఎదురొచ్చిన దాన్ని గాల్లోకి ఎగరేస్తుంది. మరి ఈ రెండు బలమైన జంతువులు ఎదురెదురుగా తలపడితే గెలుపు ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

హిప్పో బరువు సాధారణంగా 1,500 నుంచి 3,200 కిలోల వరకు ఉంటుంది. ఇది తన నోటిని దాదాపు 180 డిగ్రీల వరకు తెరవగలదు. దాని పెద్ద కోరలు, శక్తివంతమైన దవడలు ఒక్కసారి బిగిస్తే ఎముకలు సైతం విరిగిపోతాయి. ప్రపంచంలో అత్యంత దూకుడుగా ఉండే అడవి జంతువుల్లో హిప్పో ఒకటి. ముఖ్యంగా నీటిలోకి ఎవరైనా ప్రవేశిస్తే ఏమాత్రం వెనుకాడకుండా దాడి చేస్తుంది.

ఇక రైనో విషయానికి వస్తే.. దాని ముక్కుపై ఉండే కొమ్మే ప్రధాన ఆయుధం. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి ఒక్క దెబ్బతో ప్రత్యర్థిని కుప్పకూల్చగలదు. మందమైన చర్మం, అపారమైన బలం రైనోకు అదనపు బలం. అయితే ఈ పోరులో గెలుపు ఎక్కడ జరుగుతుందనేదే కీలకం. నీటిలో లేదా నీటి ఒడ్డున పోరు జరిగితే హిప్పోకు స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది. తన బరువు, కాటు శక్తితో రైనోను నిలువరించే అవకాశం ఎక్కువ. కానీ పొడి నేలపై రైనో తన వేగం, కొమ్ముతో హిప్పోకు గట్టి సవాల్ విసరగలదు.

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇద్దరూ పూర్తిగా ఎదిగిన, ఆరోగ్యవంతమైన జంతువులైతే హిప్పోకు స్వల్ప ఆధిక్యం ఉంటుంది. కారణం దాని అసాధారణమైన దవడ బలం, భారీ శరీరాకృతి, అత్యంత దూకుడు. అయితే రైనోను తక్కువ అంచనా వేయలేం. సరైన సమయంలో కొమ్ముతో దాడి చేస్తే పోరాట ఫలితం మారిపోయే అవకాశం కూడా ఉంటుంది.

అయితే ప్రకృతిలో హిప్పోలు, రైనోలు ఒకదానితో ఒకటి తలపడటం చాలా అరుదు. ఇవి సాధారణంగా వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తాయి. అందుకే ఈ ‘టైటాన్స్ క్లాష్’ ఎక్కువగా ఊహల్లోనే మిగిలిపోతుంది. అయినప్పటికీ బలం, దూకుడు, ఆయుధాల పరంగా చూస్తే ఈ పోరులో హిప్పోకే కాస్త పైచేయి ఉందని నిపుణులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *