Headlines

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి, వ్యవసాయం, విద్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి, పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 3,168 ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసేందుకు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వివిధ శాఖల్లో నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.

విద్యా రంగానికి సంబంధించి బాపట్ల జిల్లాలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక గోదావరి పుష్కరాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.300 కోట్ల రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.

ఈ సమావేశంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల నుంచి తాజా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సాగులో ఉన్న పంటల విస్తీర్ణం, వివిధ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితులపై సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు.

త్రాగునీరు, సాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతులు, ప్రజలకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *