Headlines

డ్రైవింగ్ టెస్ట్‌లో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కిన యువతి.. ఆ తర్వాత సీన్‌ ఇదే

డ్రైవింగ్ టెస్ట్‌లో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కిన యువతి.. ఆ తర్వాత సీన్‌ ఇదే


తెనాలి, జులై 23: డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొన్న ఓ యువతి పొరపాటున బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తెనాలిలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాఘవరావు, త్రీ టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

తెనాలి రవాణా శాఖ కార్యాలయం పరిధిలో డ్రైవింగ్ లైసెన్సులు, లైసెన్స్ రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ పరీక్షలను తెనాలి మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి లైసెన్స్ పరీక్ష కోసం కారులో వచ్చారు. మొదటి యువతి విజయవంతంగా డ్రైవింగ్ పరీక్ష పూర్తి చేసి వాహనంలోనే కూర్చుంది. అనంతరం రెండో యువతి డ్రైవింగ్ టెస్ట్ ప్రారంభించింది. అయితే కారు కొంతదూరం వెళ్లిన తర్వాత యువతి పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను బలంగా తొక్కింది. దీంతో కారు ఒక్కసారిగా వేగం పెంచుకుని అక్కడే నిలబడి ఉన్న ప్రజలు, వాహనాల వైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించినప్పటికీ వాహనాన్ని నియంత్రించలేకపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వృద్ధులు, ఒక మహిళ గాయపడ్డారు. కారులో ఉన్న మరో యువతి అప్రమత్తమై వెంటనే హ్యాండ్ బ్రేక్ వేయడంతో కారు ద్విచక్ర వాహనాలను ఢీకొని ఆగిపోయింది. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

Tenali Market Yard Accident

ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడికి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. డ్రైవింగ్ పరీక్షల సమయంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మార్కెట్ యార్డు ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *