తెలుగు సినిమా స్వర్ణయుగంలో తన నటనతో, ముఖ్యంగా హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటి దాసరి గిరిజ జీవితం ఒక విషాద గాథ. తెరమీద నవ్వులు పంచిన ఆమె, తెర వెనుక తీవ్రమైన వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె జీవిత ప్రయాణం, సినీ రంగంలో ఆమె సాధించిన విజయాలు, ఆ తర్వాత ఎదుర్కొన్న అవాంతరాలు, చివరి రోజుల్లో పడిన బాధలు ఎందరికో తెలియని వాస్తవాలు. గిరిజ తల్లి దాసరి తిలకం కూడా నటి కావడంతో, చిన్నతనం నుంచే సినిమా వాతావరణం ఆమెకు పరిచయం. అయితే, గిరిజ బాల్యం కృష్ణాజిల్లా గుడివాడలో, తన అమ్మమ్మగారింట్లో గడిచింది. చదువుకొని పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న గిరిజకు 13 ఏళ్ళ వయసులో పరమానందయ్య శిష్యులు చిత్రంతో తొలి అవకాశం లభించింది. ఆ తర్వాత పాతాళ భైరవిలో దేవత పాత్ర, అందులోని “నరుడా! ఏమి నీ కోరిక?” అనే ప్రసిద్ధ డైలాగ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. క్రమంగా తెలుగు, తమిళ చిత్రాలలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అగ్ర కథానాయికలైన అంజలీదేవి, సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి వారి గ్లామర్‌కు పోటీగా నిలబడలేనని గ్రహించిన గిరిజ, హాస్య పాత్రల వైపు మొగ్గు చూపారు.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఆ నిర్ణయం ఆమె కెరీర్‌కు మలుపు నిచ్చింది. హాస్యనటుడు రేలంగితో ఆమె జోడి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించింది. 1950లు, 60ల ప్రథమార్థంలో రేలంగి-గిరిజల జంట బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలను నమోదు చేసింది. వీరిద్దరి కాంబినేషన్ కోసం సినిమా నిర్మాతలు, పంపిణీదారులు ఆశగా ఎదురుచూసేవారు. “కాశీకి పోయాను రామా హరి”, “సరదా సరదా సిగరెట్టు”, “ఓహోహో మావయ్యా ఇదేమయ్యా” వంటి పాటలు ఈ జంట మీద తెరకెక్కించగా, నేటికీ ఆదరణ పొందుతున్నాయి. హాస్య నటిగానే కాకుండా, సహాయ నటిగా, కొన్ని చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ గిరిజ తన ప్రతిభను చాటారు. రేలంగి ఆమెకు ఒక ఇల్లు కొనిచ్చారంటే వారి అనుబంధం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య
అయితే, 1960ల చివరకు వచ్చేసరికి సినిమా రంగంలో పోటీ పెరిగింది. పద్మనాభం-గీతాంజలి, ఆ తర్వాత రాజబాబు-రమాప్రభల వంటి కొత్త హాస్య జంటలు రావడంతో రేలంగి-గిరిజల ప్రభ మసకబారింది. పాత్రల ప్రాధాన్యత తగ్గడంతో, గిరిజ క్యారెక్టర్ రోల్స్‌కు మారారు. 1967లో ప్రొడక్షన్ మేనేజర్ సన్యాసిరాజును పెళ్లి చేసుకున్న ఆమె జీవితం అక్కడి నుంచి తీవ్ర మలుపు తిరిగింది. సన్యాసిరాజు నిర్మించిన భలే మాస్టర్, పవిత్ర హృదయాలు చిత్రాలలో గిరిజ తన సంపాదనను పెట్టుబడిగా పెట్టారు. ఆ రెండు సినిమాలు పరాజయం పాలవడంతో ఆమె ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు, సన్యాసిరాజు తాగుడుకు బానిసై గిరిజను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు. వారి ఏకైక కూతురు శ్రీగంగను కూడా సరిగా చూసుకోలేదు. చివరికి, గిరిజ డబ్బు అంతా ఖర్చైన తర్వాత, సన్యాసిరాజు కుటుంబాన్ని వదిలి అదృశ్యమయ్యాడు. మహారాణిలా బ్రతికిన గిరిజ, అప్పులు తీర్చడానికి తన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చివరి రోజుల్లో ఆమె ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారి, కనీస అవసరాల కోసం తెలిసిన వారి వద్ద యాభై, వంద రూపాయలు అడిగి తీసుకునే దీన స్థితికి చేరుకున్నారు. గిరిజ, తన తల్లి తిలకంతో, కూతురు శ్రీగంగతో కలిసి దుర్భర జీవితం గడిపారు. 1995 సెప్టెంబర్ 5న ఆమె కన్నుమూసినప్పుడు, సినీ పరిశ్రమ నుండి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం శోభన్ బాబు మాత్రమే శ్రీగంగను పరామర్శించారని చెబుతారు. శ్రీగంగ ప్రస్తుతం సలీమా పేరుతో చెన్నైలో ఇంటీరియర్ డెకరేటర్‌గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్ వేసుకున్నారు: దేవి ప్రసాద్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.