Headlines

తులసి చెట్టుకు నీళ్లు ఎప్పుడు పోయాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..


తులసి చెట్టుకు నీళ్లు ఎప్పుడు పోయాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

భారతీయ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే తులసి కోట ముందు ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించడం, నీరు పోసి పూజించడం కామన్. అయితే భక్తితో మనం పోసే నీరే ఒక్కోసారి ఆ మొక్క ప్రాణాలకు ముప్పుగా మారుతుందని మీకు తెలుసా? తులసి మొక్కకు నీరు పోయడానికి ఒక సరైన సమయం, పద్ధతి ఉన్నాయి. వాటిని పాటించకపోతే మొక్క వేర్లు కుళ్లిపోయి త్వరగా వాడిపోయే ప్రమాదం ఉంది. తులసి మొక్కకు నీరు పోయడానికి ఉదయం సమయం అత్యంత శ్రేష్ఠం. ఉదయాన్నే నీరు అందించడం వల్ల మొక్క వేర్లు తేమను సులభంగా గ్రహిస్తాయి. పగటిపూట తగిలే సూర్యరశ్మి ఆ నీటిని మొక్క ఎదుగుదలకు ఉపయోగపడేలా చేస్తుంది. అంతేకాకుండా, ఎండ వేడిమికి మట్టిలోని అదనపు తేమ క్రమంగా ఆవిరైపోతుంది.

సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నీరు పోయవచ్చా?

నిపుణుల సూచనల ప్రకారం.. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తులసి మొక్కకు నీరు పోయకపోవడమే ఉత్తమం. రాత్రిపూట ఎండ ఉండదు కాబట్టి మట్టి ఎక్కువ సేపు తడిగా ఉంటుంది. దీనివల్ల వేర్లకు గాలి ఆడక, ఫంగస్ చేరి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో రాత్రిపూట నీరు అసలు పోయకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే, సూర్యాస్తమయానికి ముందే మొక్క మొదట్లో కొద్దిపాటి నీటిని మాత్రమే చల్లాలి.

ప్రతిరోజూ నీళ్లు పోయడం అవసరమా?

చాలామంది ఆచారంలో భాగంగా ప్రతిరోజూ చెంబుడు నీళ్లు తులసి కోటలో పోస్తుంటారు. కానీ మొక్కకు ప్రతిరోజూ నీరు అవసరం లేదు. మట్టి పైపొర పూర్తిగా పొడిబారినప్పుడు మాత్రమే నీరు పోయాలి. కుండీ పరిమాణం, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సూర్యరశ్మి: తులసి మొక్కకు రోజూ తగినంత ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి.

డ్రైనేజీ వ్యవస్థ: మొక్క పెంచే కుండీ లేదా కోట అడుగు భాగంలో అదనపు నీరు బయటకు వెళ్లేలా రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి.

నీరు నిల్వ ఉండకూడదు: మొక్క మొదలు వద్ద నీరు ఎప్పుడూ నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.

సీజన్ల వారీగా మార్పులు: వర్షాకాలంలో వర్షపు నీరు తగిలితే విడిగా నీరు పోయడం తగ్గించాలి. అలాగే చలికాలంలో మట్టి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నీటి పరిమాణాన్ని బాగా తగ్గించాలి.

భక్తితో పూజించడంతో పాటు ప్రకృతి నియమాలకు అనుగుణంగా సరైన సంరక్షణ తీసుకుంటేనే తులసి మొక్క కలకాలం పచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *