Headlines

అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతం.. 49 ఏళ్ల తర్వాత “ఒక కాంతి రోజు”కు వాయేజర్-1 !!


అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో అరుదైన మైలురాయి ఆవిష్కృతం కానుంది. భూమి నుంచి ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తుంది “నాసా వాయేజర్-1”. ఇప్పుడు ఈ వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు (One Light-Day) దూరాన్ని చేరుకోనుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్-1 చరిత్ర సృష్టించనుంది. ఈ క్రమంలోనే ఇది నిజంగా మానవ మేధస్సుకు, శాస్త్ర సాంకేతిక విజయానికి ఓ అద్భుత నిదర్శనమని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

‘కాంతి రోజు’ అంటే..

సాధారణంగా ‘కాంతి రోజు’ అంటే సమయం అనుకుంటారు కానీ.. అంతరిక్షంలో సుదూరాలను కొలవడానికి దీనిని ఒక కొలమానంగా చెబుతారు. కాంతి 24 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని ఒక కాంతి రోజు అంటారు. సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి.. ఒక రోజులో 25.9 బిలియన్ కిలోమీటర్లు (16.1 బిలియన్ మైళ్లు) ప్రయాణిస్తుంది. ఇప్పుడు నాసా వాయేజర్-1 ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకోనుంది. ఇక సూర్యకాంతి భూమిని చేరడానికి కేవలం 8 నిమిషాల 20 సెకన్లు మాత్రమే పడుతుందని అందరికీ తెలిసిందే.

కాగా భూమి నుంచి నాసా శాస్త్రవేత్తలు ఏదైనా రేడియో సిగ్నల్ పంపితే అది వాయేజర్‌కు చేరడానికి ఒక పూర్తి రోజు పడుతుంది. దానికి వాయేజర్ తిరిగి సమాధానం పంపడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ పూర్తవ్వడానికి ఏకంగా 48 గంటల సమయం వేచి చూడాల్సిందే. గతంలో 1990 ఫిబ్రవరి 14న వాయేజర్-1 సుమారు 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమిని చిత్రీకరించింది. ఆ చిత్రంలో భూమి విశాలమైన అంతరిక్షంలో ఒక చిన్న నీలి చుక్కగా కనిపించింది. ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఈ చిత్రాన్ని “Pale Blue Dot” గా ప్రపంచానికి పరిచయం చేశారు.

వాయేజర్-1 ప్రయోగానికి కారణం..

సౌర కుటుంబంలోని వెలుపలి గ్రహాలైన గురుడు (Jupiter), శని (Saturn), వాటి ఉపగ్రహాలు, వలయాలపై అధ్యయనం చేసేందుకు 1977 సెప్టెంబర్ 5న నాసా ఈ వ్యోమనౌకను ప్రయోగించింది. దీనికంటే ముందే 1977 ఆగస్టు 20న ‘వాయేజర్-2’ను ప్రయోగించినప్పటికీ, వాయేజర్-1 వేగవంతమైన మార్గంలో ప్రయాణించి అదే ఏడాది డిసెంబర్‌లో తన కవల వ్యోమనౌకను దాటేసింది. గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని వేగాన్ని పెంచుకునే ‘గ్రావిటీ అసిస్ట్’ టెక్నిక్‌తో ఇది ప్రయాణించింది. 1979లో గురు గ్రహాన్ని, 1980లో శని గ్రహాన్ని దాటిన తర్వాత సౌర కుటుంబం దాటి నక్షత్రాల మధ్య ఉండే శూన్య ప్రదేశం (Interstellar space) వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది.

వాయేజర్-1 ప్రయాణం ఎటు వైపు..

ప్రస్తుతం వాయేజర్-1 ‘ఉర్సా మైనర్’ (లిటిల్ బేర్) నక్షత్ర మండలం దిశగా ప్రయాణిస్తోంది. భూమికి 17 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘గ్లీజ్ 445’ అనే నక్షత్రం వైపుగా ఇది కదులుతోంది. మరో 40 వేల ఏళ్ల తర్వాత ఆ నక్షత్రానికి దగ్గరగా (1.7 కాంతి సంవత్సరాల దూరంలో) వెళ్తుందని నాసా అంచనా వేస్తుంది. 2012 ఆగస్టులోనే సూర్యుడి ప్రభావం ఉండే ప్రాంతాన్ని (Heliopause) దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగుపెట్టిన తొలి మానవ నిర్మిత వస్తువుగా ఇది రికార్డు సృష్టించింది. మరోవైపు వాయేజర్-2, 2035 నవంబర్ నాటికి ‘ఒక కాంతి రోజు’ మైలురాయిని చేరుకోనుంది.

గ్రహాంతరవాసుల కోసం ‘గోల్డెన్ రికార్డ్’..

వాయేజర్-1 కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు.. భూమి తరఫున విశ్వానికి పంపిన ఒక రాయబారి కూడా. భవిష్యత్తులో ఎప్పుడైనా గ్రహాంతరవాసులకు ఈ వ్యోమనౌక తారసపడితే, భూమిపై మనుషులు, జీవరాశి ఉందని తెలియజేయడానికి ఇందులో 12 అంగుళాల బంగారు పూత పూసిన రాగి డిస్క్‌ను (‘గోల్డెన్ రికార్డ్’) అమర్చారు. ఇందులో 55 భాషల్లో పలకరింపులు, సంగీతం, ప్రకృతి శబ్దాలు, మనుషులు, జంతువులు, భూమిపై రోజువారీ జీవితానికి సంబంధించిన చిత్రాలను నిక్షిప్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, అనంత విశ్వంలో భూమి ఉనికిని చాటే ఒక ‘టైమ్ క్యాప్సూల్‌’ను మోసుకుంటూ వాయేజర్-1 తన అలుపెరగని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *