Headlines

Telangana: విద్యార్థుల కోసం తెలంగాణ సర్కార్ సూపర్ ప్రోగ్రామ్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు..


విద్యార్థులకు చదువుతోపాటు సమాజం, చరిత్ర, సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పుస్తకాల్లో చదివిన చారిత్రక విశేషాలను స్వయంగా చూసి తెలుసుకునేలా తెలంగాణ దర్శిని పేరుతో విద్యా పర్యటనలు నిర్వహించాలని నిర్ణయించింది. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26.30 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలోని పలు శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. విద్య, పర్యాటక, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, అటవీ శాఖల సహకారంతో సుమారు 2,92,286 మంది విద్యార్థులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెండో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి విద్యా స్థాయికి అనుగుణంగా పర్యటనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనల నిర్వహణ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 చొప్పున వెచ్చించనున్నారు. ఇందులో రూ.500ను విద్యాశాఖ సర్వశిక్షా అభియాన్ నిధుల నుంచి, మరో రూ.400ను పర్యాటక శాఖ సమకూర్చనుంది. మొత్తం నిధులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో వినియోగించనున్నారు. పర్యటనల షెడ్యూల్, ప్రదేశాల ఎంపిక, నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను రూపొందించే బాధ్యతను సంస్థ ఎండీకి అప్పగించారు.

తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కళా కేంద్రాలు, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌తో పాటు వరంగల్ కోట, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, భువనగిరి కోట వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. బుద్ధవనం, కొలనుపాక జైన మందిరం వంటి వారసత్వ ప్రాంతాలనూ పర్యటనలో భాగం చేయనున్నారు. అదేవిధంగా శిల్పారామం, పోచంపల్లి, చేర్యాల, నిర్మల్ ప్రాంతాల్లోని కళలు, హస్తకళల ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించనున్నారు. ప్రకృతి అందాలను పరిచయం చేసేందుకు అనంతగిరి కొండలు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు, మేడారం, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల సందర్శనకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, పర్యావరణంపై ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ వైభవం, వారసత్వ సంపద, పర్యాటక ప్రాధాన్యాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ దర్శిని విద్యార్థులకు విజ్ఞానంతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *