
హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. పానీపూరీలు, సమోసాలను భారీ స్థాయిలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్న ఈ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా ఆహార భద్రతా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే ఆహార తయారీ, విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేలింది. వంటగదిలో అపరిశుభ్రత, ఈగల బెడద, శుభ్రత లోపాలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా ఓపెన్ డ్రైనేజీ పక్కనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ప్రజలు తినే ఆహారాన్ని కనీస పరిశుభ్రత లేకుండా తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక తనిఖీల్లో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఇప్పటికే వాడి నల్లగా మారిన వంటనూనెను మళ్లీ ఆహార తయారీలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని అధికారులు తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 3 వేల పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంటనూనెను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అలాగే ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఆ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ కార్యకలాపాలను నిలిపివేసి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటనతో బయట ఆహారం తినే వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలపై వినియోగదారులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..