Headlines

Watch : ఏం ఐడియా గురూ.. ఇలా చేస్తే పరీక్షల్లో కాపీయింగ్‌కు చెక్.. వీడియో వైరల్ !


సాధారణంగా పరీక్షలు అనేవి విద్యార్థుల జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించే ఒక ముఖ్యమైన ప్రక్రియ మాత్రమే. అయితే కొందరు సులభంగా పాస్ అవ్వాలని, ర్యాంకుల సాధించాలని.. మిగతా వారి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.. ఫెయిల్ అయితే కొడతారనే భయంతో కాపీయింగ్ (మాల్ ప్రాక్టీస్) వంటి తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. అయితే కాపీ కొట్టడం వల్ల తాత్కాలికంగా మార్కులు రావచ్చేమో కానీ భవిష్యత్తులో నిజమైన నైపుణ్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా సదరు పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడితే డీబార్ అయ్యి విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కష్టపడి చదివి, సొంత ప్రతిభతో పరీక్షలు రాసినప్పుడే నిజంగా పాస్ అయినట్టు అని అంటుంటారు.

ఈ క్రమంలోనే పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్ చేయకుండా చూసేందుకు అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంటారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఇన్విజిలేటర్లను నియమించడం.. కఠినమైన నిబంధనలు అమలు చేయడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుంటారు. అయితే చైనాలో పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న ఒక వినూత్న విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. అందరూ ఫిదా అవుతున్న ఆ ఐడియా ఏంటి ? ఆ కథ ఏంటో తెలుసుకుందాం…

చైనాలో వినూత్న పర్యవేక్షణ విధానం..

మామూలుగా పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు విద్యార్థుల మధ్య తిరుగుతూ పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న విధానం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. పరీక్షా కేంద్రం పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎత్తైన గ్లాస్ వాక్‌వేపై ఇన్విజిలేటర్ నడుస్తూ కింద పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలిస్తున్నారు. దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులపై నిఘా ఉంచే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రతి విద్యార్ధికి తాను పరీక్ష రాసే టేబుల్ పైన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ మరొకరికి కనిపించకుండా ముందు వైపు, పక్కన అడ్డంగా కవర్ చేశారు. దీంతో ఈ ఐడియా పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియాలో సాధ్యమేనా..?

ఇక ఎత్తైన ప్రదేశం నుంచి మొత్తం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉండటం ఈ విధానంలోని ప్రత్యేకతగా చెప్పవచ్చు. కానీ ఈ విధానం ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? ఇతర దేశాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు సాధ్యమవుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ తరహా విధానం అమలు చేయడం అంటే కష్టమే అని చెప్పాలి. అందుకు తగ్గ ప్రదేశం.. ఈ వీడియోలో చూపిన విధంగా మొత్తం అరేంజ్ చేయడం అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది ఒరిజినల్ వీడియోనా లేక ఏఐ వీడియోనా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

వైరల్ వీడియో.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *