Ravi Pushya Yoga on November 29, 2026: కార్తీక మాసంలో సంభవించే ప్రతి రోజు పవిత్రమైనదే అయినప్పటికీ, నవంబర్ 29, 2026న రాబోయే రవి పుష్య యోగం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలయికతో ఏర్పడే ఈ పుష్యార్క యోగానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
రవి పుష్య యోగం ప్రాముఖ్యత:
పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున రావడమే కాకుండా, సాధారణంగా జూలై 15 నుండి ఆగస్టు 15 మధ్య సంభవించే రవి పుష్య యోగం, ఈసారి కార్తీక మాసంలో రావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జాతకంలో ఉండే కొన్ని కర్మ సంబంధిత దోషాలను తొలగించుకోవడానికి ఈ రోజు అనుకూలమైనది. ముఖ్యంగా, సంతానం లేని వారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ విజయం సాధించలేని వారు, కెరీర్ పరంగా వెనుకబడిన వారు, లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యోగ కాలంలో చేసే పూజలు, పరిహారాల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరు. శని గ్రహ ప్రభావం, సూర్యుడితో దాని అనుసంధానం వల్ల ఏర్పడే కర్మలను ఈ రోజు తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యం, సంతానం, వృత్తి విజయాల కోసం పరిహారాలు:
రవి పుష్య యోగం రోజున, కర్మబంధాలను తొలగించుకోవడానికి దానము, మంత్ర జపము, హోమము వంటివి ఆచరించవచ్చు. నిర్దిష్టంగా, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చే దీర్ఘరోగాల నివారణకు ఆరోగ్య పాశుపతం చేసుకోమని జ్యోతిష్య పండితులు సూచించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి అనుగ్రహం కోసం లలితా సహస్రనామాల్లోని “ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిన్యై నమః” అనే నామాన్ని జపించడం బ్రహ్మాండంగా పనిచేస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
సంతాన భాగ్యం కోసం సూర్యుడు, గురువు (బృహస్పతి) ఇద్దరూ కారకులు. సూర్యుడు మంత్ర కారకుడు, సంతాన కారకుడు, అదృష్ట కారకుడు, రాజకీయ కారకుడు, చక్షువులకు (కళ్లకు) కారకుడు. అలాగే పితృ (తండ్రి) సంబంధిత విషయాలకు కూడా సూర్యుడు కారకుడిగా ఉంటాడు. సుదర్శన హోమం లేదా హరుణ హోమం వంటివి కూడా ఈ రోజు చేసుకోవచ్చు.
సూర్య భగవానుడి ఆరాధన:
రవి పుష్య యోగం రోజున సూర్య భగవానుడికి గోధుమ రవ్వతో నైవేద్యం సమర్పించాలి. “ప్రత్యక్ష దైవం” అయిన సూర్య భగవానుడిని చూస్తూ, ఆయనతో మాట్లాడుతున్నట్లుగా అర్ఘ్యం వదిలి నిరంతరం ప్రార్థించడం వల్ల ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సూత్రాలు అర్థం కానప్పుడు సూర్య భగవానుడి ప్రార్థనతోనే వాటిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంజనేయ స్వామి కూడా సకల విద్యలను సూర్యుడి నుంచే నేర్చుకున్నారని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 29, 2026న ఉదయం సుమారు 11 గంటల వరకు ఈ పుష్యార్క యోగం ఉంటుంది. ఈ పవర్ ఫుల్ డేని ప్రతి ఒక్కరూ చక్కగా వినియోగించుకుని సకల శుభాలు పొందాలని జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య, ఆధ్యాత్మిక విషయాలు సంప్రదాయ విశ్వాసాలు, పండితులు తెలిపిన అభిప్రాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు.)
మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.