
ఆపదలో ఉన్న వారికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకంలో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న అవకతవకలు, రాజకీయ సిఫార్సుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. అర్హులకే సహాయం చేరేలా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి సీఎంఆర్ఎఫ్ ప్రక్రియ మొత్తం డిజిటల్ ఆధారంగా సాగనుంది. చెక్కుల్లో పేర్లు, మొత్తం, ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే మునుపటిలా చేతితో సవరించే విధానానికి గుడ్‌బై చెప్పారు. ఆన్లైన్లోనే సవరణలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆలస్యాలు తగ్గడంతో పాటు మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సిఫార్సుల వ్యవస్థలోనూ కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి అయినా ఎక్కడి నుంచైనా సిఫార్సు చేసే అవకాశం ఉండేది. ఇకపై మాత్రం తమ నియోజకవర్గానికి చెందిన వారికే సిఫార్సు చేయాలి. లబ్ధిదారులు కూడా తమ ప్రాంత ఎమ్మెల్యే కార్యాలయం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగిన్ ద్వారా దరఖాస్తులు నేరుగా రెవెన్యూ విభాగానికి వెళ్లేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు.
చిన్నపాటి తప్పిదాలే సహాయం ఆలస్యానికి కారణమవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, ఆధార్, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి. అందుకే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో, ఖచ్చితంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. సహాయం అందించే విధానంలోనూ రెండు మార్గాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలోని కొన్ని ప్రత్యేక ఆసుపత్రుల్లో ముందస్తు చెల్లింపులు లేకుండా చికిత్స పొందేందుకు అనుమతి పత్రం ఇస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే చికిత్స ఖర్చులు చెల్లించిన వారు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద గతంలో పెద్ద మొత్తంలో నిధులు విడుదలైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకపై కొత్త నిబంధనలతో పారదర్శకత పెరిగి, నిజంగా అవసరమైన వారికి వేగంగా సహాయం అందుతుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్పుల అమలుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, రేషన్ కార్డు, ఆసుపత్రి బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ, బ్యాంకు పాస్‌బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సహాయం అవసరమైన, వివరాలు తెలుసుకోవాలన్నా 040-23455662, 7995733002 నంబర్లకు సంప్రదించవచ్చు.