Shreyas Iyer : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 17.5 ఓవర్లలో కేవలం 129 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఇషాన్ కిషన్, తిలక్ వర్మ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 81 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా, యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరి వీరబాదుడు వల్లనే టీమిండియా అనుకున్న స్కోరు కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే బ్యాటర్లు వరుసగా వికెట్లు పారేసుకుని ఓటమిపాలయ్యారు.
పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు గాయం.. మూడో టి20లో మార్పులు
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. తన రెండో ఓవర్ వేస్తున్న సమయంలో రెండో బంతికి కండరాల నొప్పితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మైదానం వీడక ముందే ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రిన్స్ యాదవ్ గాయం కారణంగా ఆదివారం జరగబోయే మూడో, చివరి టి20 మ్యాచ్‌లో భారత తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.
జట్టు ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. “ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ పిచ్‌పై 180 నుంచి 200 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం, కానీ మనోళ్లు ఏకంగా 219 పరుగులు చేశారు. ఇది జట్టుకు పెద్ద బోనస్‌గా మారింది. మైదానంలో ప్రదర్శించాల్సిన అసలైన దృక్పథం ఇదే. గతంలో సాధించిన విజయాల గురించి ఆలోచించకుండా, వర్తమానంలో జీవిస్తూ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం చాలా ముఖ్యం” అని అయ్యర్ తెలిపాడు.
భయం లేని ఆటతీరే మన బలం: శ్రేయస్
యువ జట్టు చూపిస్తున్న భయం లేని ఆటతీరుపై అయ్యర్ స్పందిస్తూ.. “క్రికెట్‌లో ఎప్పుడూ ఇదే రకమైన మైండ్‌సెట్ ఉండాలి. ప్రతికూలతలను పక్కనపెట్టి ముందుకు సాగడమే అసలైన విజయం. లభించిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోవాలి. ఆదివారం మాకు మరొక అద్భుతమైన అవకాశం రాబోతోంది. ఆ మ్యాచ్‌లో కూడా అదే ఉత్సాహంతో ఆడి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..