Headlines

Ramayana Movie: ‘రామాయణ’ సినిమా ప్రదర్శనను నిలిపేయాలి.. హిందూ జాగృతి సమితి డిమాండ్.. ఏం జరిగిందంటే?


‘ రామాయణం ‘ సినిమా విడుదలై దేశవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమా విదేశాలలో కూడా భారీగా వసూళ్లు సాధిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే 1500 కోట్లు సాధించింది. కాగా గతంలో, రామాయణం ఆధారంగా వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పుడు, హిందూ సంస్థలతో సహా అనేక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు ‘రామాయణం’ కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందేమోనని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అలా జరగలేదు. అయితే, ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక హిందూ సంస్థ ‘రామాయణం’ సినిమాపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ‘రామాయణం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, కొన్ని హిందూ సంస్థల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ‘సృజనాత్మక స్వేచ్ఛ’ అనే నెపంతో కథను ‘ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని’ హిందూ జాగృతి సమితి ఆరోపించింది. మీడియాతో మాట్లాడుతూ, ఆ సంస్థ నాయకులు, ‘రావణుడిని కీర్తించడం, అసలు కథలోని పలు ఘట్టాలను వక్రీకరించడం, లక్ష్మణుడి పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం, శ్రీరాముడు, లక్ష్మణుడి పరాక్రమానికి వ్యతిరేకంగా ఉండే సన్నివేశాలు ఈ చిత్రంలో అత్యంత అభ్యంతరకరమైన అంశాలు’ అని అన్నారు.

అణగారిన వారిని రక్షించేవాడిగా, పేదలకు బంగారు ఇళ్లు ఇచ్చేవాడిగా రావణుడిని చిత్రీకరించడాన్ని కూడా హిందూ జాగృతి సమితి సంస్థలు వ్యతిరేకించాయి. ఆ రాక్షస రాజును న్యాయం చేసే సోషలిస్టుగా చూపించడం కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రోత్సహించడంతో సమానం. ఒక దాసిని వేధించినందుకు శూర్పణకళ భర్త విద్యుత్జీవ్యుడిని రావణుడు చంపే సన్నివేశాన్ని కూడా వారు వ్యతిరేకించారు. రాముడు, లక్ష్మణుడు రావణుడి సైన్యంతో పోరాడి పారిపోవడం, సీత రాక్షసులతో పోరాడటం వంటి మరికొన్ని సన్నివేశాలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ జనజాగృతి సమితి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆర్గనైజర్ సునీల్ ఘనవత్ మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ‘రామాయణం’ చిత్రం ‘కమ్యూనిస్టు’ ఎజెండాను ప్రచారం చేస్తోందని, అందువల్ల సాంప్రదాయ హిందువులు ఈ చిత్రాన్ని చూడవద్దని విజ్ఞప్తి చేశారు. హిందువులు మినహా మిగతా అన్ని మతాల అనుచరుల మనోభావాల గురించే CBFC పట్టించుకుంటుందని ఆయన అన్నారు. ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. క్రైస్తవుల నిరసనల కారణంగా ‘ది డా విన్సీ కోడ్’ చిత్రం గోవా, కేరళల్లో విడుదల కాలేదు. ఒక పూజారి కుక్కకు పెళ్లి చేసే సన్నివేశంపై క్రైస్తవ సమాజ సభ్యులు అభ్యంతరం తెలపడంతో ‘కమల్ ధమాల్ మలమల్’ చిత్రాన్ని కూడా విడుదల కానీయలేదు. కానీ సెన్సార్ బోర్డు హిందువుల మతపరమైన మనోభావాల పట్ల ఎందుకు ఇంత ఉదాసీనతతో వ్యవహరిస్తోంది? అని ఆయన ప్రశ్నించారు.

సంస్థ ప్రతినిధి అభయ్ వర్తక్ మాట్లాడుతూ, “‘రామాయణం’ సినిమాలో అసలు గ్రంథంలోని అనేక ఘట్టాలను వక్రీకరించడం ఆమోదయోగ్యం కాదు. దేశానికి శ్రీరాముని భక్తుడైన ప్రధానమంత్రి, శ్రీరాముడిని ఆదర్శంగా భావించే ప్రభుత్వం ఉన్న తరుణంలో, ఇటువంటి సృజనాత్మక రచనల ద్వారా చరిత్రను వక్రీకరించడం దురదృష్టకరం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *