దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 09 కిమీ వేగంతో కదులుతుందని తెలిపారు. ఇది ప్రస్తుతానికి నరసాపురానికి 500 కిమీ, కళింగపట్నంకి 540కిమీ, చెన్నైకి 560 కిమీ, గోపాల్‌పూర్‌కి 630 కిమీ, పూరీకు 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో గురువారం ఈ క్రింది జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాస 3 ఎన్డీఆర్ఎఫ్, విజయనగరంలో 1 ఎస్డీఆర్ఎఫ్, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరు, సీతంపేటలో 2ఎన్డీఆర్ఎఫ్ మొత్తంగా 5 NDRF, 1 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.