తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లిగా, అత్తగా, వదినగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆమె గత కొంతకాలంగా వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ తన దృష్టినంతా ఫిట్నెస్ , స్పోర్ట్స్ వైపు మళ్లించారు. ప్రస్తుతం ప్రగతి తన కలలను సాకారం చేసుకుంటున్నారు.
సాధారణంగా సినీ రంగానికి చెందిన నటీనటులు జిమ్ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు షేర్ చేయడం చూస్తుంటాం. కానీ ప్రగతి మాత్రం కేవలం ఫిట్నెస్ కోసమే కాకుండా, ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టింగ్ , పవర్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు, అవార్డులు సాధించి భారతీయ మహిళల సత్తాను చాటిన ప్రగతి, తాజాగా మరొక ప్రతిష్టాత్మక 'నేషనల్ ఛాంపియన్షిప్' పోటీల్లో పాల్గొన్నారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అత్యంత ప్రతిభను కనబరుస్తూ భారీ బరువులను లిఫ్ట్ చేశారు. ఈ పోటీలకు సంబంధించిన ఫొటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో ప్రగతి ఎంతో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించారు. పోటీల వేదికపై ఆమె చూపించిన ఏకాగ్రత, పట్టుదల ,శ్రమను చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రగతి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, సాధించాలనే తపన, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఏ వయసులోనైనా కొత్త లక్ష్యాలను చేరుకోవచ్చని ప్రగతి మరోసారి నిరూపించారు. వర్కవుట్ విషయంలో , స్పోర్ట్స్‌లో ఆమె చూపిస్తున్న ఈ నిబద్ధత ఎంతోమంది మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు , ఫిట్నెస్ ప్రియులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
వెండితెరపై నటిగా అలరించిన ప్రగతి, ఇప్పుడు క్రీడా రంగంలో కూడా పతకాలు సాధిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలపడంతో పాటు “మీరు ఎంతోమందికి ఇన్సిపిరేషన్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రగతి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిసి మరిన్ని పతకాలు సాధించాలని ఆశిద్దాం




