దేశంలో మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని, మహిళా రిజర్వేషన్ అమలుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించి తీరుతామని ప్రధాని మోదీ అన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయంగా, నిర్ణయాత్మక రంగాల్లో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా తాను కూడా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారిలో ఒకరిగా నిలిచానని వెల్లడించారు. ఎంతో మంది మహిళలు తమ సమస్యలు, ఆకాంక్షలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చారని, ఎందరో సోదరీమణులు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని నారీశక్తి ఆశీర్వాదం తమకు పూర్తిగా ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, మహిళా రిజర్వేషన్ మార్గంలో వచ్చే అడ్డంకులను పూర్తిగా తొలగిస్తామని ప్రతి ఒక్క మహిళకు భరోసా ఇచ్చారు.
ఈ విషయంలో తమ ఆత్మవిశ్వాసం బలంగా ఉందని, ధైర్యం చెక్కుచెదరనిదని, సంకల్పం అచంచలమని మోదీ ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న పార్టీలు, పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల భాగస్వామ్యాన్ని పెరగకుండా ఎప్పటికీ ఆపలేవని తేల్చి చెప్పారు. ఈ మార్పు కోసం కేవలం సమయం మాత్రమే వేచి చూడాల్సి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
We had made a promise to our Nari Shakti and we remain committed to fulfilling it… https://t.co/ZT3TK71Psh
— Narendra Modi (@narendramodi) November 28, 2026
మరోవైపు డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాజకీయంగా వేడి నెలకొంది. ఈ బిల్లుకు తగిన సంఖ్యాబలంపై కేంద్రం ధీమాతో ఉంది. అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను 50 శాతం ఫ్లాట్గా పెంచేలా తాజా చట్టంలో హామీ ఇవ్వడంతో, గత ఏప్రిల్లో బిల్లును వ్యతిరేకించిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, డీఎంకే ఇప్పుడు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ తిరిగి సమావేశం కానున్నాయి. ప్రభుత్వ పనితీరు, అవసరాలకు అనుగుణంగా ఈ సమావేశాలు డిసెంబర్ 3తో ముగియనున్నాయి.
మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి లోక్సభలో కేటాయించిన సీట్లు అలాగే వాటి శాసనసభల బలాన్ని 50 శాతం పెంచి, 2051 వరకు సవరించిన సీట్ల కేటాయింపులు, సరిహద్దులను స్తంభింపజేసేలా కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026 ద్వారా లోక్సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీల పరిమాణ పరిమితిని 500 నుంచి 650కి పెంచాలని ఈ బిల్లులో పొందుపరిచారు.