Headlines

NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు జారీ

NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు జారీ


హైదరాబాద్, జులై 30: NEET UG 2026 కౌన్సెలింగ్‌కు ముందు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక మార్పులను ప్రకటించింది. వైద్య ప్రవేశాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌లో ఏదైనా రౌండ్‌లో సీటు పొందిన అభ్యర్థులు తదుపరి రౌండ్‌లో అప్‌గ్రేడ్ (Upgrade) ఎంపిక చేసుకుంటే, ఇప్పటికే కేటాయించిన కళాశాలకు ప్రత్యక్షంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వారి అడ్మిషన్ యథాతథంగా కొనసాగుతుంది. వీరు తదుపరి రౌండ్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గడంతో పాటు సమయం, ఆర్థిక భారం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులపై తగ్గనుంది.

ఆన్‌లైన్ ద్వారానే సీటు వదులుకునే సౌకర్యం

మరో కీలక నిర్ణయం ఏమంటే కేటాయించిన సీటును వదులుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఆన్‌లైన్ రాజీనామా (Online Resignation) సౌకర్యాన్ని MCC అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై సంబంధిత మెడికల్ కళాశాలకు వెళ్లకుండా కౌన్సెలింగ్ నిబంధనలు, గడువులోపు ఆన్‌లైన్ ద్వారానే సీటును రద్దు చేసుకునే అవకాశం కల్పించింది.

NRI కోటా అభ్యర్థులకు కొత్త వెసులుబాటు

NRI కోటా కింద డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోరే విద్యార్థులు ఇకపై అవసరమైన పత్రాలను కౌన్సెలింగ్ పోర్టల్‌లోనే ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. దీంతో డాక్యుమెంట్ సమర్పణ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ మార్పుల అమలుకు సంబంధించి 2026 మే, జూన్ నెలల్లో MCC పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య అధికారులు, మెడికల్ కళాశాలల ప్రతినిధులు ఈ శిక్షణల్లో పాల్గొని కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కమిటీ సూచించింది. కౌన్సెలింగ్ సమయంలో సీట్ల లభ్యత, కళాశాల ఫీజులు, అడ్మిషన్‌కు సంబంధించిన ఇతర కీలక వివరాలు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య అధికారులను MCC ఆదేశించింది. ఇటీవల NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను MCC త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైద్య విద్య అభ్యర్థులు అధికారిక ప్రకటనలపై దృష్టి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *