Headlines

Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..

Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..


కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకొడుకే వారి పాలిట యముడైతే.. చట్టం తన విధిని కచ్చితంగా నిర్వహిస్తుందని నంద్యాల కోర్టు మరోసారి నిరూపించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వేధించడంతో పాటు, గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసిన ఓ యువకుడికి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన విజయవర్ధన్ రెడ్డి తన ఇంట్లో తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కలవారితోనూ నిత్యం గొడవలకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవాడు. అతని అల్లరి ప్రవర్తనతో విసిగిపోయిన గ్రామస్థులు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి ఆత్మకూరు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

కేసును విచారించిన ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి.. సాక్ష్యాధారాలు, నిందితుడి నేర స్వభావాన్ని పరిశీలించి అతనికి నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కడతేరుస్తూ, సమాజంలో అశాంతిని సృష్టించే మృగాళ్లలా ప్రవర్తించేవారికి ఈ తీర్పు ఒక కనువిప్పు అని మేధావులు, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సమాజంలో బాధ్యతారహితంగా ప్రవర్తించే యువతకు, ముఖ్యంగా కన్నవారినే కన్నీరు పెట్టిస్తున్న కొడుకులకు ఈ సంచలన తీర్పు ఒక బలమైన చెంపపెట్టు లాంటిదని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ తీర్పు ద్వారా పోలీసులు, న్యాయస్థానాలు సమాజానికి ఒక స్పష్టమైన, బలమైన సందేశాన్నిచ్చాయి. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, వృద్ధులైన అమ్మానాన్నలను వేధించినా, గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించినా ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఈ తరహా కఠిన శిక్షలు అమలైతే సమాజంలో మార్పు వస్తుందని, వృద్ధ తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవించడానికి భద్రత ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టం ముందు ఎవరూ చుట్టాలు కాదనే నిజాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *