దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందిన నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఆమె తన కెరీర్, సహ నటులతో తన అనుభవాలు, అలాగే వ్యక్తిగత ఎదుగుదల గురించి లోతైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేసిన తన అనుభవాలను మీనా గుర్తుచేసుకున్నారు.
ముఖ్యంగా, వెంకటేష్‌తో తన కెరీర్లో అత్యధిక విజయాలు సాధించానని, ఆయనతోనే తనకు అత్యంత కంఫర్ట్ గా, స్నేహపూర్వకంగా ఉండేదని మీనా స్పష్టం చేశారు. “డెఫినిట్లీ వెంకీ గారు” అని చెప్పిన ఆమె, ఆయనతో మంచి అనుబంధం ఉందని, ఎక్కువ హిట్లు వెంకటేష్‌తోనే వచ్చాయని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో తాను చాలా నిశ్శబ్దంగా ఉండేదానినని, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారితో కూడా వృత్తిపరంగానే ఉండేదానినని మీనా వివరించారు. బాలకృష్ణ మాత్రం తనతో ఎప్పుడూ మాట్లాడుతూ, తనను కూడా మాట్లాడించేవారని సరదాగా గుర్తుచేసుకున్నారు.
మోహన్ బాబుతో తన అనుభవాలు పూర్తిగా భిన్నంగా ఉండేవని మీనా నవ్వూతూ చెప్పారు. “అల్లరి మొగుడు” చిత్రం సమయంలో తాను చాలా చిన్నవయస్సులో ఉన్నానని, ఆయన అల్లరి చేసేవారని, బెదిరించేవారని తెలిపారు. అప్పట్లో తెలుగు సరిగ్గా రాకపోవడం వల్ల, ఆయన సరదాగా మాట్లాడేది అర్థం కాలేదని, మొదట్లో ఆయనంటే కొంచెం భయం ఉండేదని మీనా పేర్కొన్నారు. మోహన్ బాబు ధామ్ ధూమ్ అని మాట్లాడటం, అందరినీ రేయ్, రారా అని పిలవడం వంటివి మిగతా హీరోలందరితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉండేవని ఆమె వివరించారు.
అయితే, కాలక్రమేణా ఆయన ఒక స్వీట్హార్ట్ అని, బయట కనిపించే దానికి భిన్నంగా లోపల చాలా మంచి వ్యక్తి అని తనకు అర్థమైందని మీనా తెలిపారు. ఆయన కుటుంబంతో, లక్ష్మి, విష్ణు, మనోజ్ లతో కలిసి అంతాక్షరి, మ్యూజికల్ చైర్స్ ఆడిన జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. తన కెరీర్లో అల్లరి, కొంటె పాత్రలు చేయడానికి చాలా ఇష్టపడేదానినని మీనా వెల్లడించారు. హైలీ సెంటిమెంటల్ పాత్రల కంటే అల్లరి పాత్రలలో తన నిజమైన వ్యక్తిత్వం బయటపడేదని ఆమె పేర్కొన్నారు.
తన వృత్తి నైపుణ్యం గురించి మాట్లాడుతూ, “నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే, నేను చాలా ప్రొఫిషనల్,. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడా, ఎవరూ, ఎప్పుడూ చెప్పలేరు” అని మీనా అన్నారు. తన వృత్తిపరమైన నిజాయితీ తన అతి పెద్ద బలం అని, అది తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని తెలిపారు. తన సినీ జీవితంలో తనకు పెళ్లి ప్రపోజల్స్ రాలేదా అని అడిగినప్పుడు, తాను చాలా చిన్నవయస్సులో ఉండటం, ప్రేమ, మనుషుల సంబంధాల గురించి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని సరదాగా బదులిచ్చారు.




