Headlines

Kadapa: ప్రియుడి చేతిలో సోదరి నగలు.. యువతి జీవితంలో పెను విషాదం!


ప్రేమించిన వ్యక్తిని నమ్మి చేసిన ఓ సాయం చివరకు విషాదంగా మారింది. సోదరి పెళ్లి కోసం దాచిన బంగారు నగలు కనిపించకపోవడం.. వాటిని తిరిగి తీసుకొచ్చే మార్గం లేకపోవడంతో ఓ యువతి తీవ్ర ఒత్తిడికి గురైంది. ప్రియుడిని ఎన్నిసార్లు అడిగినా నగలు ఇవ్వకపోగా, బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. కడపలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.

కర్నూలు నగరానికి చెందిన ప్రేమ్‌కుమార్, మనోహరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. హోంగార్డుగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మరణించారు. అనంతరం ఆయన భార్య మనోహరి కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగంలో చేరారు. చిన్న కుమార్తె దివ్య దీపిక (23) కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) చదువుతోంది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది.

అదే కాలేజ్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఇటీవల సొంతూరికి వెళ్లిన దివ్య దీపికను సంజయ్ డబ్బులు కావాలని కోరాడు. అతడిని నమ్మిన ఆమె.. తన సోదరికి చెందిన బంగారు గొలుసు, ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. సంజయ్ ఆ నగలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.

ఇంతలో దివ్య దీపిక సోదరికి పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో నగలు తీసుకురావాలని తల్లి మనోహరి కోరారు. దీంతో ప్రియుడికి పలుమార్లు ఫోన్ చేసి నగలను విడిపించి ఇవ్వాలని దివ్య అడిగింది. అయితే సంజయ్ మాత్రం రోజులు గడుపుతూ మాట దాటవేశాడు. పైగా తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

ఓవైపు సోదరి పెళ్లి.. మరోవైపు తల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. దీంతో దివ్య దీపిక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కడపలోని తన వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోదరి వివాహం కోసం తీసుకున్న నగల వ్యవహారం చివరకు కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రేమ పేరుతో ఏర్పడిన నమ్మకం ఇలా విషాదాంతం కావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *