కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, నూనె అర కప్పు, పచ్చిమిర్చి 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, టమాటాలు 2 (మీడియం సైజు), అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు అర కప్పు, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు 1 పావు టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా), కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు.
ముందుగా కేజీ చికెన్‌ను నిమ్మరసం లేదా వెనిగర్ వేసిన నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వల్ల ఎలాంటి నీచు వాసన లేకుండా చికెన్ తాజాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అర కప్పు నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించి, ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత తరిగిన రెండు టమాటా ముక్కలు వేసి మెత్తని గుజ్జులా మగ్గేవరకు ఉడికించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి. ఇందులో అర కప్పు చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ వేయించాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి కమ్మదనంతో పాటు చికెన్ ముక్కలు ఎంతో మృదువుగా ఉడుకుతాయి.
ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాల పచ్చివాసన పోయేవరకు వేయించాలి. అనంతరం శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసి మసాలా అంతా పట్టేలా కలిపి, మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో చికెన్‌లోని నీరంతా బయటకు ఊరుతుంది.
ఆ తర్వాత మూత తీసి రుచికి సరిపడా మరో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కారం పచ్చివాసన పోయేవరకు ఉడికించాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఎండు కొబ్బరి తురుము వేసి కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేతిని చేత్తో నలిపి వేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే చికెన్ కర్రీ సిద్ధం.




