ప్రమాదానికి గురై ప్రాణాపాయంలో ఉన్న డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ యాపిల్ పండ్లను ఎత్తుకెళ్లేందుకు జనాలు పోటీ పడిన ఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తొర్రూరు మండలం మట్టెవాడ వద్ద జరిగింది. యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న యాపిల్ పండ్లు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, గాయపడిన డ్రైవర్‌ను పట్టించుకోకుండా.. రోడ్డుపై పడిపోయిన పండ్లను ఎత్తుకెళ్లడంలో బిజీ అయిపోయారు. సంచులు, డబ్బాలు తీసుకొచ్చి అందిన కాడికి దోచుకెళ్లారు. కొందరైతే ఏకంగా ఆటోలు తీసుకొచ్చి అక్కడున్న పండ్లను నింపుకొని వెళ్లారు. ఇలా కొన్ని నిమిషాల్లోనే వాహనంలోని సరుకునంతా లూటీ చేశారు.
అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన వాహనం వివరాలు సేకరించి, యజమానికి సమాచారం అందించారు.
జనాలు యాపిల్ పండ్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. “ఓ పక్క ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా పండ్ల కోసం ఎగబడ్డారు.. మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతోంది” అని ఒకరు, “ఉచితంగా వస్తుందని ఇలా పరాయి సొమ్మును ఎత్తుకెళ్లడం ఏంటి?” అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.