Headlines

తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది? అలమేలుమంగగా అవతరించిన శ్రీ మహాలక్ష్మి.. ఈ దివ్య చరిత్ర తెలుసా?


Tiruchanur Temple History Telugu: తిరుచానూరు అనగానే సిరులతల్లి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గుర్తుకొస్తారు. లక్ష్మీ అనే పదానికి సంపద, అభివృద్ధి, క్షేమం, శుభం, యోగం వంటి అనేక అర్థాలు ఉన్నాయి. అటువంటి జగన్మాత కొలువై ఉన్న పవిత్ర క్షేత్రమే తిరుచానూరు. ఈ ప్రాంతానికి ఎంతో పురాతనమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నాయి.

పూర్వం తిరుచానూరులో శ్రీ శుకమహర్షి ఆశ్రమం ఉండేదని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని తొలుత ‘శ్రీశుకుని ఊరు’ అని పిలిచేవారని, కాలక్రమంలో ఆ పేరు ‘శ్రీశుకనూరు’, ‘తిరుచ్చుకనూరు’గా మారి చివరకు ‘తిరుచానూరు’గా స్థిరపడిందని చెబుతారు. శ్రీ శుకమహర్షి తాత అయిన పరాశర మహర్షి తపస్సు చేసిన యోగిమల్లవరం (జోగిమల్లవరం) కూడా ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. పురాణాల ప్రకారం ద్వాపరయుగం చివరలో, కలియుగం ప్రారంభంలోనే ఈ క్షేత్రం ఉన్నట్లు తెలుస్తోంది.

పురాణగాథ ప్రకారం.. భృగుమహర్షి పరీక్ష కారణంగా శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలోని కొల్హాపుర క్షేత్రంలో కొలువయ్యారు. అమ్మవారిని తిరిగి వైకుంఠానికి రప్పించాలనే సంకల్పంతో శ్రీ వేంకటేశ్వరస్వామి తపస్సు చేసి ప్రార్థించారు. స్వామివారి ప్రార్థనకు అనుగ్రహించిన అమ్మవారు స్వర్ణముఖి నదీ తీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న పద్మసరోవరంలో పద్మంపై అవతరించారు. అలా అలమేలుమంగగా, పద్మావతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ‘అలర్‌మేల్‌ మంగ’ అంటే పద్మంపై ప్రకాశించే దివ్యవనిత అని అర్థం.

ఇవి కూడా చదవండి



అనంతరం అమ్మవారిని శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన వక్షస్థలంపై ‘వ్యూహలక్ష్మి’గా నిలుపుకొని తిరుమలకు చేరుకున్నారని పురాణాలు వివరిస్తాయి. అలమేలుమంగమ్మ అర్చామూర్తిగా కొలువైన ఈ క్షేత్రం ‘అలమేలుమంగ పట్నం’గా కూడా ప్రసిద్ధి చెందింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తమ కోరికలను స్వామివారికి చేరవేసి, అవి నెరవేరేలా అనుగ్రహించాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు. కొల్హాపురంలో శ్రీ మహాలక్ష్మిగా, నారాయణవనంలో శ్రీ పద్మావతిగా, తిరుచానూరులో అలమేలుమంగగా, తిరుమలలో శ్రీనివాసుని హృదయపద్మంలో వ్యూహలక్ష్మిగా అమ్మవారు కొలువై భక్తులకు కల్పవల్లిగా పూజలందుకుంటున్నారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పురాణగాథలు, స్థలపురాణ విశేషాలు హిందూ ధార్మిక విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తి, ఆధ్యాత్మిక కోణంలో చూడగలరు.)

మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *