ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాషకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు.. ఇలా ఏ రంగంలో చూసినా ఇంగ్లీష్ తప్పనిసరిగా మారుతోంది. కనీసం ఇంగ్లీష్ చదవడం, రాయడం రాకపోతే చాలా సందర్భాల్లో వెనుకబడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనం రోజూ ఇంగ్లీష్‌లో ఎన్నో పదాలు రాస్తుంటాం. పుస్తకాలు, వార్తాపత్రికలు, మొబైల్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టుల్లో ఇంగ్లీష్ అక్షరాలను చూస్తూనే ఉంటాం. కానీ ఆ అక్షరాల్లో ఉండే కొన్ని విషయాలను పట్టించుకొకపోవచ్చు. కానీ వాటి వెనుక పెద్ద స్టోరీ ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు ఇంగ్లీష్‌లోని 26 అక్షరాలను గమనిస్తే.. చిన్న అక్షరాలైన ‘i’, ‘j’ పైన మాత్రమే చుక్కలు కనిపిస్తాయి. మరి ఈ అక్షరాలకు మాత్రమే ఆ స్పెషాలిటీ ఏంటి ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలు విషయం ఇదే..
ఈ అక్షరాల చరిత్రను గమనిస్తే.. అప్పట్లో పుస్తకాలు, పత్రాలను చేతితో రాసేవారు. ఒకే వరుసలో వరుసగా వచ్చే i,j అక్షరాలను గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉండేదట. ముఖ్యంగా పక్కపక్కనే అక్షరాలు వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా వేరు చేయడానికి ఈ చుక్కను ఉపయోగించేవారు. కాలక్రమేణా ఈ పద్ధతి విస్తరించిందని అంటున్నారు. 15వ శతాబ్దం చివరి నాటికి రోమన్ ఫాంట్లలో కూడా ఈ గుర్తు సాధారణంగా కనిపించడం ప్రారంభమైందని వివరిస్తున్నారు. ఇక వీటి పైన ఉండే చిన్న చుక్కను ‘టిటిల్’ (Tittle) అని పిలుస్తారు. Dictionary.com ప్రకారం ఈ పదం ఆ చిన్న గుర్తుకు ఉపయోగించే అధికారిక పేర్లలో ఒకటి. ఈ తరహా అక్షర గుర్తులను సాధారణంగా గ్లిఫ్స్ (Glyphs) అని కూడా అంటారు. అయితే ‘టిటిల్’ అనేది ప్రత్యేకంగా ‘i’, ‘j’ అక్షరాల పైన ఉండే చుక్కను సూచిస్తుంది. కొన్ని ఇతర భాషల్లో అక్షరాలపై ఉండే చిన్న గుర్తులు వాటి ఉచ్చారణను లేదా అర్థాన్ని మార్చగలవు. కానీ ఇంగ్లీష్‌లో మాత్రం ఈ చుక్కలు ‘i’, ‘j’ అక్షరాల ఉచ్చారణను మార్చవు. ఈ టిటిల్ అనే పదం లాటిన్ భాషలోని ‘Titulus’ అనే పదం నుంచి వచ్చింది. దీనికి చిన్న గుర్తు లేదా చిహ్నం అనే అర్థాలు ఉన్నాయి.
మరోవైపు రెండు చుక్కలను ఒకదాని కింద మరొకటి ఉంచిన గుర్తును ‘కోలన్’ ( : ) అంటారు. ఒక విషయాన్ని వివరించడానికి, ఉదాహరణలు ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ పదం గ్రీకు భాషలోని ‘Kolon’ నుంచి వచ్చింది. అలాగే వరుసగా మూడు చుక్కలు (…) కనిపిస్తే దానిని ‘ఎలిప్సిస్’ (Ellipsis) అంటారు. ఒక వాక్యంలో కొంత సమాచారాన్ని వదిలివేసినప్పుడు, ఆలోచన ఇంకా కొనసాగుతోందని చెప్పాలనుకున్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. ఇలా మనం ప్రతిరోజూ చదివే, రాసే ఇంగ్లీష్ భాషలో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక “దేశ భాషలందు తెలుగు లెస్స”.. మన తెలుగు భాష గొప్ప తనాన్ని వర్ణించాలంటే ఈ ఒక్క మాట చాలు. అజంతా, ఎల్లోరా శిల్పకళలా అందమైనది మన మాతృ భాషకు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. వేల ఏళ్ల ఘన చరిత్ర ఉన్న మన భాష.. నేడు ఇంగ్లీష్ ఆధిపత్యం ముందు నిశ్శబ్దంగా వెనకబడుతోంది. ప్రస్తుత ఆధునిక యుగంలో చదువు, ఉద్యోగాల పేరుతో ఇంగ్లీష్ మాధ్యమం అనివార్యమైంది. అయితే ఇంగ్లీష్ మాట్లాడటాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావించడంతో, మన నిత్య జీవితంలో స్వచ్ఛమైన తెలుగు కనుమరుగై ‘తెంగ్లీష్’ రాజ్యమేలుతోంది. పాఠశాలల్లో తెలుగు బోధించడం అనే విషయాన్ని పక్కన పెడితే తెలుగు మాట్లాడితే కూడా పాపం లాగా చూస్తే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి.