ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ నుంచి కార్ల రిమోట్ కీస్ వరకు అన్నీ వైర్‌లెస్ సిగ్నల్స్ మీదే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ టెక్నాలజీ సౌకర్యంతో పాటు భద్రతా పరమైన ఆందోళనలను కూడా పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఫెరడే బ్యాగ్’ (Faraday Bag) అనే సరికొత్త టెర్మ్ టెక్ ప్రపంచంలో గట్టిగా వినిపిస్తోంది. డిజిటల్ ప్రైవసీని కాపాడుకోవడంలో ఈ ప్రత్యేకమైన పౌచ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అసలు ఈ ఫెరడే బ్యాగ్ విశేషాలేంటో చూద్దాం..
ఫెరడే బ్యాగ్ అంటే..
ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వచ్చే వైర్‌లెస్ సిగ్నల్స్‌ను పూర్తిగా నిరోధించడానికి ఈ ప్రత్యేకమైన పౌచ్ లేదా కవర్‌ను డిజైన్ చేశారు. దీని లోపలి భాగంలో కాపర్, నికెల్ లేదా అల్యూమినియం వంటి కండక్టివ్ మెటీరియల్స్ లేయర్ లతో ఉంటుంది. ఇందులో ఫోన్ లేదా ఇతర గాడ్జెట్లు పెట్టి జిప్ వేస్తే చాలు.. బయటి నుంచి వచ్చే సిగ్నల్స్ లోపలికి రాకుండా, లోపలి సిగ్నల్స్ బయటికి వెళ్లకుండా బ్లాక్ అయిపోతాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఫెరడే ప్రతిపాదించిన ‘ఫెరడే కేజ్’ (Faraday Cage) ప్రిన్సిపల్ ఆధారంగానే దీనికి ఆ పేరు పెట్టారు. మార్కెట్లో దీన్ని ఫెరడే పౌచ్, సిగ్నల్ బ్లాకింగ్ బ్యాగ్, ఆర్ఎఫ్‌ఐడీ బ్లాకింగ్ పౌచ్, ఈఎంఎఫ్ ప్రొటెక్షన్ పౌచ్ లేదా యాంటీ ట్రాకింగ్ పౌచ్ వంటి రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు.
ఏయే సిగ్నల్స్ కట్ అవుతాయి..
ఈ బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ భద్రపరిస్తే మొబైల్ నెట్‌వర్క్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని సిగ్నల్స్ నిలిచిపోతాయి. ఫలితంగా లొకేషన్ ట్రాకింగ్ ప్రమాదం తప్పుతుంది. అయితే ఈ ప్రయోజనం దక్కాలంటే బ్యాగ్‌ను పూర్తిగా, సరిగ్గా క్లోజ్ చేయడం తప్పనిసరి. కేవలం ఫోన్లే కాకుండా స్మార్ట్‌వాచ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డులు, కీ-లెస్ ఎంట్రీ కార్ల రిమోట్ కీస్‌ను కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ముఖ్యంగా కార్ల రిమోట్ సిగ్నల్స్‌ను హ్యాక్ చేసి చేసే దొంగతనాల నుంచి ఇది అద్భుతంగా రక్షణ కల్పిస్తుంది.
ధర..
మన దేశంలో ఫెరడే బ్యాగ్ ధర సుమారు రూ. 199 నుంచి ప్రారంభమై రూ. 15,000 వరకు ఉంది. దాని సైజ్, బ్రాండ్, సిగ్నల్స్‌ను అడ్డుకునే పొరల నాణ్యతను బట్టి ధర మారుతుంటుంది. కార్ల రిమోట్ కీస్ కోసం చిన్న పౌచ్‌లు తక్కువ ధరకే లభిస్తాయి. అదే ఫోరెన్సిక్ లేదా ఈఎంపి (EMP) భద్రత కోసం వాడే హెవీ-డ్యూటీ బ్యాగ్‌లు మాత్రం ఖరీదుగా ఉంటాయి. వీటిని కొనేముందు వాటి స్పెసిఫికేషన్స్, యూజర్ రివ్యూలను పరిశీలించడం మంచిది. తక్కువ ధరకు వచ్చే నాణ్యత లేని పౌచ్‌లు అన్ని రకాల ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను సరిగ్గా నిరోధించలేవు.
లాభాలతో పాటు ఇబ్బందులూ..
- ఈ బ్యాగ్ వల్ల డివైజ్‌లను బాహ్య వైర్‌లెస్ కనెక్షన్ల నుంచి పూర్తిగా వేరు చేయవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, సున్నితమైన మీటింగ్స్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
- అయితే దీనివల్ల కొన్ని చిన్న సమస్యలూ ఉన్నాయి. ఫోన్ లోపల ఉన్నప్పుడు అత్యవసర కాల్స్, మెసేజ్‌లు రావు. ఒకవేళ బ్యాగ్ సరిగ్గా క్లోజ్ కాకపోతే సిగ్నల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది.
- అలాగే నెట్‌వర్క్ కోసం ఫోన్ పదే పదే ప్రయత్నించడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది.
పూర్తి ప్రైవసీ దొరుకుతుందా..
ఫెరడే బ్యాగ్‌ను డిజిటల్ భద్రతకు పూర్తి పరిష్కారంగా భావించలేమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇది కేవలం వైర్‌లెస్ సిగ్నల్స్, కనెక్టివిటీని మాత్రమే అడ్డుకుంటుందని.. ఫోన్‌లో ఇప్పటికే సేవ్ అయి ఉన్న డేటాకు లేదా ప్రమాదకరమైన యాప్ పర్మిషన్లకు ఇది ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. అందుకే దీనితో పాటు ఫోన్ ప్రైవసీ సెట్టింగ్స్, యాప్ అనుమతులు, పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) వంటి భద్రతా పద్ధతులను పాటించడం కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.