Headlines

Tirumala: శ్రీవారి దర్శనానికి వచ్చి బంగారం పోగొట్టుకున్న భక్తుడు.. చివరికి ఏమైందంటే!


తిరుమలలో ఓ భక్తుడికి ఎదురైన ఆందోళనకు టీటీడీ సిబ్బంది వేగంగా స్పందించి తెరదించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి పొరపాటున పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి తిరిగి అప్పగించారు. దాదాపు 60 గ్రాముల బంగారం మళ్లీ తన చేతికి చేరడంతో ఆ భక్తుడు ఊపిరి పీల్చుకున్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. అయితే కారు దిగుతున్న సమయంలో ఆయన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు కింద పడిపోయాయి. ఆ సమయంలో గమనించని ఆయన కొంతదూరం వెళ్లిన తర్వాత నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే తిరుమల కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించారు.

ఫిర్యాదు అందిన వెంటనే టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ సిబ్బంది సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో కిందపడిన ఆభరణాలను ఇద్దరు వ్యక్తులు తీసుకున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా వారిని గుర్తించి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు భక్తుడికి నగలను తిరిగి అందజేశారు. పోయాయనుకున్న విలువైన ఆభరణాలు కొద్ది గంటల్లోనే తిరిగి లభించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వీడియో రూపంలో ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో నమోదు చేశారు.

తిరుమలలో భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. సమయానికి స్పందించి బంగారాన్ని తిరిగి అందించిన విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు, కమాండ్ కంట్రోల్ సిబ్బందిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *