బ్యాంకింగ్ కస్టమర్లకు ఆర్బీఐ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి బ్యాంకులకు కీలక ఆదేశాలిచ్చింది. ఇక నుంచి ఖాతాదారుడు ఏదైనా అత్యంత అనుమానాస్పద లావాదేవీలు జరిపితే.. దానిని నిలిపివేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అత్యంత అనుమానాస్పద లావాదేవీలపై డెబిట్ హోల్డ్ విధించేందుకు బ్యాంకులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. జులై 1,2027వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. అనుమానాస్పద లావాదేవీల కోసం ఏకరీతి, కాలపరిమితితో కూడిన విధానం అమలు చేయాలని ఆర్ధిక సంస్థలకు సూచించింది. అలాగే అటువంటి ఖాతాలను కూడా నిలిపివేసే హక్కు బ్యాంకులకు ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
ఇలాంటి లావాదేవీలపై నిరంతర నిఘా
అత్యంత అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్, మనీ మ్యూల్ అకౌంట్, సైబర్ నేరాలకు పాల్పడేవారి అకౌంట్లు, ఆర్థిక మోసం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే ట్రాన్సాక్షన్ల ద్వారా వచ్చిన నిధులను తెలిసి లేదా తెలియకుండా తన సొంత తరఫున స్వీకరించడం లేదా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతాలను మూసివేయడం లేదా లావాదేవీలను నిలిపివేసే అధికారం బ్యాంకులకు ఆర్బీఐ అప్పగించింది. అటువంటి ఖాతాలను బ్యాంకులు అత్యంత అనుమానాస్పదంగా పరిగణించి డెబిట్ హోల్డ్ విధించవచ్చు. అలాగే డెబిట్ హోల్డ్ విధించిన తేదీ నుండి ఐదేళ్ల పాటు బ్యాంకులు డెబిట్ హోల్డ్‌లో ఉంచిన సొమ్ము, డెబిట్ హోల్డ్ విధించిన తేదీ, విడుదల చేసిన తేదీలు, అందుకు గల కారణాలు, ఖాతాదారుడు, పోలీసు అధికారులతో జరిపిన సంప్రదింపుల సమాచారాన్ని భద్రపరచాలి.
హోల్డ్ విధించిన తర్వాత బ్యాంకులు ఏం చేయాలి..?
డెబిట్ హోల్డ్ లేదా ఖాతాను హోల్డ్‌లో ఉంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా ఖాతాదారునికి వెంటనే బ్యాంకులకు సమాచారం అందించాలి. లేకపోతే తదుపరి పనిదినం ముగిసేలోపు తెలపాలని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే నిజమైన లావాదేవీలను పొరపాటున హోల్డ్‌లో పడకుండా చూసుకునేందుకు, అత్యంత అనుమానాస్పద లావాదేవీలు, ఖాతాలను గుర్తించడానికి అవసరమైన సాంకేతికతను బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఖాతాలపై బ్యాంక్ సమగ్ర తనిఖీ చేపట్టాలని ఆర్బీఐ సూచించింది. నిజమైన ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా చూస్తూనే అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని కోరింది. అనుమానాస్పద లావాదేవీలు ఉన్న ఖాతాలన్నీ అత్యంత అనుమానాస్పద ఖాతాలు కానవసరం లేదని కూడా ఆర్బీఐ తెలిపింది. ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోతుండటం, ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లకు మరింత నిఘా పెంచేందుకు ఈ కొత్త నిర్ణయాలు ఉపయోగపడనున్నాయి.