Headlines

Weather Report: పొంచి ఉన్న మరో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?


తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. డిసెంబర్ 2వ తేదీకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వివిధ వాతావరణ మోడల్స్ ప్రకారం వాయుగుండం సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నాయని వివరించింది.

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. తెలంగాణలో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం..

బంగాళాఖాతంలో నవంబర్ 30న ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచనా వేసింది.

తెలంగాణలో వాతావరణం ఇలా..

ఈ అల్పపీడనం ప్రభావం ఇటు తెలంగాణపై కూడా ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ రోజు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *