Headlines

గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. బంగారం ధరలు తగ్గితే సమస్యలే.. ఎలా బయటపడాలంటే..?


గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్.. బంగారం ధరలు తగ్గితే సమస్యలే.. ఎలా బయటపడాలంటే..?

బంగారం ధరలు గత వారంలో పడిపోగా.. ఈ వారంలో స్వల్పంగా పెరుగుతూ వస్తోన్నాయి. కానీ జీవితకాలపు గరిష్ట స్థాయిలో పోలిస్తే గత 10 నెలల్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. పడిపోతున్న బంగారం ధరలు తాకట్టు పెట్టిన ఆభరణాల విలువను తగ్గిస్తున్నాయి. దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నవారు ఆందోళనలు చెందుతున్నారు. బంగారం ధరలు గతంతో పోలిస్తే తగ్గడంతో లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి పెరుగుతోంది. దీని వల్ల అనుమతించబడిన కాలపరిమితిలోగా LTVని నిర్దేశిత పరిమితి కంటే తక్కువకు తీసుకురావడానికి పాక్షిక చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో రుణంలో సగం అమౌంట్ వరకు చెల్లించాల్సిందిగా రుణగ్రహీతలను బ్యాంకులు ఒత్తిడి చేసే అవకాశముంది.

వేలం వేసే అవకాశం..!

పాక్షిక చెల్లింపు చేయడం ద్వారా మార్జిన్ లోటును భర్తీ చేయవచ్చు. అయితే చెల్లింపులో రుణగ్రహీత విఫలమైతే రుణదాత బంగారాన్ని వేలం వేయవచ్చని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. దీనిని రుణం నిరర్థక ఆస్తిగా (NPA) మారితే రుణ గ్రహీతకు మరిన్ని ఇబ్బందులు తప్పవని, వేలం కూడా నిర్వహించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల బ్యాంకులు గోల్డ్ లోన్ తీసుకున్నవారికి నోటీసులు పంపడంతో పాటు రుణం చెల్లించాల్సిందిగా మెస్సేజ్‌లు పంపుతున్నారనే వార్తల తెరపైకి వచ్చాయి. అయితే ఈ నోటీసులు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లోటును భర్తీ చేసేందుకు బ్యాంకులు 10 నుంచి 14 రోజులు గడువు కల్పిస్తాయి

రుణగ్రహీతలు ఏం చేయాలి..?

నోటీసులు అందినప్పుడు రుణగ్రహీతలు అకౌంట్ నెంబర్, బకాయిల వివరాలు, వేలం తేదీ, విలువ నిర్ధారణకు ఆధారాన్ని చెక్ చేయాలి. చెల్లింపులు , బకాయిల ప్రస్తుత స్టేట్‌మెంట్‌ను బ్యాంకులను అడగాలి. అలాగే అసలు, వడ్డీ, ఛార్జీలు, చెల్లించాల్సిన చివరి తేదీని చూపే బకాయిల రాతపూర్వక స్టేట్‌మెంట్‌ను అడగాలని నిపుణులు సూచిస్తున్నారు. మరింత బంగారాన్ని తాకట్టు పెట్టడం లేదా పాక్షిక చెల్లింపు చేయడం ద్వారా వేలం పాట జరగకుండా రుణగ్రహీతలు నివారించవచ్చని చెబుతున్నారు. అలాగే అమ్మకాన్ని ఆపడానికి లిఖితపూర్వక పరిష్కార కొటేషన్ పొందాలని సూచిస్తున్నారు. రుణదాతలు ఆభరణాల విలువను నిర్ణయించడానికి స్వచ్ఛత, నికర బరువు, ప్రస్తుత బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. రాళ్లు, రత్నాలు, తయారీ ఛార్జీలను మినహాయిస్తారు. విలువ నిర్ధారణ పత్రాన్ని అడిగి రుణదాత విలువను ఎలా లెక్కించారో తనిఖీ చేయాలని చెబుతున్నారు. ఆభరణాల విలువను తక్కువగా అంచనా వేశారని రుణగ్రహీత భావిస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. వేలానికి ముందే పునఃమూల్యాంకనం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు. వేలం పాటకు ఖచ్చితంగా హాజరుకావాలని సూచిస్తున్నారు.  ఆర్ధిక సంస్థలకు అమ్మకం ద్వారా ఎంత మొత్తం సమకూరిందో , ఆ సొమ్మును బకాయిలకు ఎలా వినియోగించిందో రుణగ్రహీతకు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అమ్మకం ద్వారా రావాల్సిన దానికంటే ఎక్కువ వసూలైతే..  7 రోజుల్లోగా మిగులు సొమ్ము వాపసును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *