Headlines

‘ఇంటర్‌ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..’ CM రేవంత్‌రెడ్డికి లేఖ


హైదరాబాద్‌, నవంబర్ 27: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులను నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదన రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఓయూ ప్రొఫెసర్‌, ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ కన్వీనర్‌ ఆచార్య జగదీశ్వర్‌రావు వీరనేని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన నవంబరు 25న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడం వల్ల తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటాలో లభించే అవకాశాలు తగ్గిపోతాయని లేఖలో వివరించారు.

రాష్ట్ర విద్యార్థులకు స్థానిక కోటాలో నష్టం?

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి వైద్య విద్యా కోర్సుల్లో స్థానిక కోటా కింద సీట్లు పొందాలంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కళాశాలల్లోనే 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతిస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని ఆచార్య జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడి ఇంటర్‌ కళాశాలల్లో 9వ తరగతిలో చేరి వరుసగా నాలుగేళ్లు చదివితే స్థానిక కోటా కింద వైద్య విద్యా సీట్లకు అర్హత పొందే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇప్పటికే తెలంగాణలో చదువుతున్న స్థానిక విద్యార్థులకు పోటీ పెరిగి, వారి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి



ఇంటర్‌ కళాశాలలకు 9 నుంచి 12వ తరగతి వరకు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రధానంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థలో ఇలాంటి మార్పులు తీసుకొచ్చే ముందు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు, స్థానిక కోటా నిబంధనలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేటప్పుడు తెలంగాణ విద్యార్థుల విద్యా అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆచార్య జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇంటర్‌ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయడం, ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులకు అనుమతులు ఇవ్వడం వంటి నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరారు. ముఖ్యంగా వైద్య విద్యలో స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *