Headlines

17 ఏళ్లకే AI స్టార్టప్ నిర్మించిన యువతి.. ChatGPTపై స్కూల్లో నిషేధం!


వర్జీనియా, సెప్టెంబర్ 29: స్కూల్లో ChatGPTను నిషేధిస్తే.. ఆంక్షలు ఎదురైన ఓ విద్యార్థి ఏం చేస్తుంది? ChatGPT వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా, అవసరమైనప్పుడు మాత్రమే AIని ఉపయోగించాలనే పాఠాన్ని నేర్చుకుంది అమెరికాలోని 17 ఏళ్ల నవ్య తుతేజా. ఇప్పుడు ఆమె ఏకంగా AI ఆధారిత ఉచిత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించి, స్టార్టప్‌ను నడుపుతోంది. వర్జీనియాలోని Thomas Jefferson High School for Science and Technologyలో సీనియర్‌గా చదువుతున్న నవ్య.. న్యూరోడైవర్జెంట్ ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా Raaha అనే ఉచిత AI ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు.. ఆ ఉద్యోగం తమకు సరిపోతుందో లేదో అంచనా వేసుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సహాయపడుతుంది.

రెండు నెలల్లోనే 1000 మందికి పైగా యూజర్లు

నవా్య రూపొందించిన Raahaకు ప్రారంభ దశలోనే మంచి స్పందన లభించింది. Fortune నివేదిక ప్రకారం.. రెండు నెలల్లోనే ఈ ప్లాట్‌ఫామ్‌ను 1,000 మందికి పైగా యూజర్లు ఉపయోగించగా, 20,000కు పైగా ఉద్యోగ ప్రకటనలు ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. సాధారణంగా ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు అభ్యర్థుల నుంచి తమకు కావాల్సిన నైపుణ్యాలను వివరిస్తాయి. అయితే.. ఆ ఉద్యోగంలో వాస్తవంగా పని చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఉద్యోగ వాతావరణం తమకు అనుకూలంగా ఉంటుందా? అనే విషయాలపై తగిన సమాచారం ఉండకపోవచ్చు. ఈ లోటును పూడ్చాలనే ఉద్దేశంతో నవ్య Raahaను రూపొందించింది. నవ్య తల్లి వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, ఉద్యోగ ప్రకటనలను పరిశీలించినప్పుడు తాను గమనించిన విషయాలు Raaha ఆలోచనకు కారణమయ్యాయని నవ్య తెలిపింది. Raaha వివిధ అంశాల ఆధారంగా ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి స్కోర్ చేస్తుంది. దీంతో అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో గంటల సమయం వెచ్చించే ముందు.. ఆ ఉద్యోగం తమకు సరిపోతుందా లేదా అనే దానిపై ఒక అవగాహనకు రావచ్చు.

స్కూల్లో ChatGPT, Claudeకు.. నో పర్మిషన్

నవ్య చదువుతున్న పాఠశాలలో ChatGPT, Claude వంటి AI టూల్స్‌కు Wi-Fi ద్వారా యాక్సెస్‌ను బ్లాక్ చేశారు. అయితే ఈ నిషేధాన్ని ఆమె పూర్తిగా ప్రతికూలంగా చూడలేదు. ChatGPTను పాఠశాలలో తక్కువగా ఉపయోగించాల్సి రావడం వల్ల.. AIపై ఆధారపడకుండా స్వయంగా ఆలోచించే అలవాటు పెరిగిందని ఆమె చెప్పింది. నవ్య స్కూల్ AI క్లబ్‌కు అధ్యక్షురాలు కూడా. అయితే చదువుకునే సమయంలో, ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు AIని ఉపయోగించకుండా ఉండటానికి ఆమె ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి



స్వయంగా Raaha అల్గారిథమ్‌ తయారీ

Raahaకు సంబంధించిన ప్రధాన అల్గారిథమ్‌ను నవ్య స్వయంగా రాసింది. AIని ప్రధానంగా వెబ్‌సైట్ డిజైన్‌ను మెరుగుపరచడం వంటి యాంత్రిక పనులకు మాత్రమే ఉపయోగించినట్లు తెలిపింది. AIని పూర్తిగా నిషేధించడం పరిష్కారం కాదని, దానిని సరైన విధంగా నియంత్రించి ఉపయోగించడమే ముఖ్యమని నవ్య అభిప్రాయపడుతోంది. Raahaతో పాటు నవ్య Legible అనే మరో టూల్‌ను కూడా రూపొందించింది. IEPs, 504 plans వంటి ప్రత్యేక విద్యకు సంబంధించిన క్లిష్టమైన పత్రాలను కుటుంబాలకు సులభంగా అర్థమయ్యే భాషలోకి మార్చడం దీని ఉద్దేశం. AI తయారు చేసే సారాంశాల్లో సమాచారాన్ని ధృవీకరించడానికి అవసరమైన మూలాలు కనిపించకుండా పోయే అవకాశం ఉందని ఆమె గుర్తించింది. దీనికి పరిష్కారంగా Traceable Accessibility అనే పారదర్శకత ప్రమాణాన్ని కూడా ప్రతిపాదించింది. ఈ అంశంపై రాష్ట్ర చట్టసభ సభ్యులు, అమెరికా విద్యాశాఖతో ఆమె చర్చలు జరిపింది.

న్యూరోడైవర్సిటీపై అవగాహన కోసం సంస్థ

నవ్య Empower InvisAbilities అనే విద్యార్థుల ఆధ్వర్యంలోని లాభాపేక్షలేని సంస్థను కూడా నిర్వహిస్తోంది. న్యూరోడైవర్సిటీ, బయటికి కనిపించని వైకల్యాలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. వర్క్‌షాప్‌లు, ఎడ్యుకేటర్ టూల్‌కిట్లు, విద్యార్థి చాప్టర్ల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నవ్య స్వయంగా నిధులు సమకూర్చుకుని Raahaను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం యూజర్ బేస్‌ను పెంచుకునే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా అందిస్తోంది. భవిష్యత్తులో కంపెనీలు, వర్క్‌ఫోర్స్ సంస్థలు తమ ఉద్యోగ ప్రకటనలను మెరుగుపరచుకోవడానికి లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవడానికి చెల్లించే విధంగా వ్యాపార నమూనాను రూపొందించే అవకాశం ఉందని ఆమె తెలిపింది. కాలేజీ చదువు కొనసాగించడం నవ్య ప్రణాళికలో భాగమే. అయితే Raaha మరింతగా అభివృద్ధి చెందితే.. దానిని పూర్తిస్థాయి వ్యాపారంగా కొనసాగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తానని ఆమె చెబుతోంది.

‘AI సహాయం చేయొచ్చు.. ఆలోచన మాత్రం మనదే’

నవ్య తల్లిదండ్రులు దీప్తి, రోహిత్ తుతేజా ఆమెకు టెక్నాలజీని ఉపయోగించమని ప్రోత్సహిస్తూనే.. దాన్ని సులభమైన మార్గంగా ఉపయోగించవద్దని సూచించారు. AI సహాయం చేయగలదని, కానీ ఆలోచన మాత్రం మనదే ఉండాలని వారు చెబుతూ వచ్చారు. స్కూల్లో AI టూల్స్‌పై నిషేధం ఎదుర్కొన్న నవ్య.. చివరకు AIని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై తనదైన ఆలోచనను ఏర్పరుచుకుంది. అంతేకాకుండా, ఆ ఆలోచనను ఒక ఉచిత AI ప్లాట్‌ఫామ్‌గా మార్చి వేలాది మంది ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా చేయడం విశేషం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *