Headlines

100 కి.మీ. ట్రాఫిక్ జామ్.. 12రోజుల పాటు వాహనాల్లోనే.. ఎక్కడో తెలుసా..?


100 కి.మీ. ట్రాఫిక్ జామ్.. 12రోజుల పాటు వాహనాల్లోనే.. ఎక్కడో తెలుసా..?

2010 ఆగస్టు 14న చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని చైనా నేషనల్ హైవే 110, బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ నరకయాతన ప్రారంభమైంది. నెమ్మదిగా మొదలైన రద్దీ.. చూస్తుండగానే పక్క రాష్ట్రాల సరిహద్దుల వరకు విస్తరించింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఒకానొక దశలో వాహనాలు రోజుకు కేవలం 1 కిలోమీటరు లేదా అంతకంటే తక్కువ దూరం మాత్రమే ముందుకు కదలగలిగాయి. కొన్ని గంటల పాటు చక్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఇన్నర్ మంగోలియా ప్రాంతం నుంచి బీజింగ్‌కు బొగ్గు, ఇతర ముడి ఖనిజాలను తరలించే భారీ ట్రక్కుల రద్దీ విపరీతంగా పెరిగింది. చట్టవిరుద్ధంగా నడిచే అదనపు లోడ్ ట్రక్కులు కూడా ఈ రహదారిపైకి భారీగా చేరుకున్నాయి. అదే సమయంలో ఆ ఎక్స్‌ప్రెస్‌వేపై మరమ్మతు, విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డు సామర్థ్యం సగానికి తగ్గడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఎండ తీవ్రత, గంటల తరబడి ఇంజిన్లు ఆన్ చేసి ఉంచడంతో వందలాది భారీ వాహనాలు మధ్యలోనే పాడైపోయాయి. ప్రమాదాలు కూడా జరగడంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది.

రోడ్డు మీదే జీవితం.. విక్రేతల దోపిడీ..

ఈ 12 రోజులు ప్రయాణికులు, డ్రైవర్లకు పీడకలగా మారాయి. రాత్రింబగళ్లు వాహనాల క్యాబిన్లలోనే గడపాల్సి వచ్చింది. సమయం గడవక డ్రైవర్లు రోడ్లపై కూర్చుని పేకాట, బోర్డ్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు. ఈ విపత్తును స్థానిక గ్రామస్తులు వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. రోడ్డు పక్కన చిరుతిళ్ళు, నీళ్లు, నూడుల్స్ అమ్మే తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. ప్రయాణికుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని విపరీతమైన ధరలు వసూలు చేశారు. సాధారణంగా 1 యువాన్ పలికే వాటర్ బాటిల్‌ను 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ధరకు, 3 యువాన్ల ఇన్‌స్టంట్ నూడుల్స్ కప్పును 16 యువాన్లకు విక్రయించారు. కొనకపోతే బెదిరింపులకు దిగేవారని బాధితులు వాపోయారు.

ట్రాఫిక్‌ను ఎలా క్లియర్ చేశారు?

పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం దాదాపు 400 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించింది.

  • హైవే వైపు వచ్చే ఇతర భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు.
  •  రాత్రి వేళల్లో మాత్రమే బొగ్గు ట్రక్కులను నగరంలోకి అనుమతించేలా నిబంధనలు పెట్టారు.
  •  రోడ్డుపై మొరాయించిన, పాడైపోయిన వాహనాలను భారీ క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు.
  •  యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యల అనంతరం, ఆగస్టు నెలాఖరు నాటికి (సుమారు 12 రోజుల తర్వాత) ట్రాఫిక్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.

భారీ ఆర్థిక నష్టం

సప్లై చైన్ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిశ్రమలకు ముడిసరుకు నిలిచిపోయింది. దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు సుమారు 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ. 1,000 కోట్లకు పైగా) మేర ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఆ తర్వాత చైనా తన హైవే మౌలిక సదుపాయాలు, బొగ్గు రవాణా కోసం ప్రత్యేక రైల్వే కారిడార్లను వేగవంతం చేయడానికి ఈ ఘటనే ప్రధాన కారణమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *