తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఆది, ప్రవీణ్, జోసెఫ్ అనే ముగ్గురు అత్యంత దారుణంగా చనిపోతారు. అయితే వీళ్ల చావులను యాక్సిడెంటల్ డెత్‌గా క్లోజ్ చేస్తారు. కానీ ఈ ముగ్గురువి యాక్సిడెంటల్ చావులు కావనీ.. ఎవరో చంపేశారని వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను మళ్ళీ ఆశ్రయిస్తారు. రెండు రోజుల్లో రిలీవింగ్ కాబోతున్న జై రామ్ అలియాస్ భరత్ ఈ కేసునే టేకప్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైమ్‌లో జై రామ్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? ఆ హంతకుడి మోటీవ్ ఏంటీ? అనేవి తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.
ఈ సిరీస్ గురించి నిర్మాత ఉదయ బాను మాట్లాడుతూ.. ‘పంచనామా’ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో పాటు వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణాన్ని కలగలిపిన కథ అని తెలిపారు. జై రామ్ నిజం కోసం చేసే ఇన్వెస్టిగేషన్ నేరాలు, అవినీతి ప్రపంచాన్ని ఎలా బయటకు తీసుకొస్తుందనేది కథలో ఆసక్తికరంగా చూపించినట్లు చెప్పారు. ప్రేక్షకులను నిరంతరం ప్రశ్నించేలా చేసే మిస్టరీతో పాటు మానవీయ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని, జీ5 ద్వారా ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జీ5 బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నిజాన్ని వెతికే ఓ పోలీస్ అధికారి ప్రయాణం ఎలా భారీ క్రిమినల్ కుట్రను వెలుగులోకి తీసుకువస్తుందనే అంశంతో ‘పంచనామా’ రూపొందిందని తెలిపారు. సస్పెన్స్, ఎమోషన్, మిస్టరీతో పాటు బలమైన పాత్రలతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని, తెలుగు ప్రేక్షకులకు ఈ ఇన్వెస్టిగేటివ్ కథనం నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.
మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ‘పంచనామా’లో భరత్ శ్రీనివాసన్‌తో పాటు శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివాజీ రాజా మారుతి పాత్రలో, మేధా రెడ్డి ధరణిగా, చరణ్ బాబు ఆదిగా, రూప లక్ష్మి పుష్పవల్లిగా, రాధిక ప్రీతి దేవకిగా, సూర్య హరిగా, శ్రీజ దివ్యగా కనిపించనున్నారు. ఒక మరణం వెనుక దాగిన నిజం కోసం మొదలైన వేట.. చివరకు ఎలాంటి చీకటి ప్రపంచాన్ని బయటపెడుతుందో చూడాలంటే ‘పంచనామా’ కోసం సెప్టెంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి
పంచనామా వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.