Headlines

‘మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ.. 74 ఏళ్ల వృద్ధుడి కన్నీటి లేఖ..!


ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి.. ఇప్పుడు న్యాయం కోసం తలుపులు తడుతున్న వృద్ధుడు. ఒకప్పుడు అన్నదమ్ములు.. ఇప్పుడు ఆస్తి కోసం ఆరోపణలు, ఫిర్యాదులు. 74 ఏళ్ల వయసులోనూ సమస్యకు పరిష్కారం దొరకక చివరకు విజయవాడ TV9 కార్యాలయానికి వచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి సి. రాజన్‌బాబు. నాకు న్యాయం చేయండి.. లేదంటే ప్రాణం తీసుకునేందుకు అనుమతి ఇప్పించండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

రాజన్‌బాబు తోపాటు ముగ్గురు అన్నదమ్ములకు 1987లో తండ్రి కుటుంబ ఆస్తిని పంచారు. కొంత ఆస్తిని తండ్రి తన పేరుతోనే ఉంచుకున్నారు. 1995లో తండ్రి మరణించారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది. 1999లో తండ్రి పేరుతో మిగిలిన ఇంటిపై తన తమ్ముడు శ్రీనివాస్ హక్కు కోరారని.. డూప్లికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉపయోగించారని రాజన్ బాబు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆస్తి వివాదమే కాదు.. తన భద్రతపైనా రాజన్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తమ్ముడు తనపై దాడి చేసి బెదిరించాడని ఆరోపిస్తున్నారు.

వయసు 74 సంవత్సరాలు.. ఇంకా ఎవరితో పోరాడాలి.. ఇంకెన్ని రోజులు తిరగాలి” అంటూ రాజన్‌బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో నాగార్జున యూనివర్సిటీలో సుమారు 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారని తన తమ్ముడిపై మరో ఆరోపణ చేశారు. దీనిపైనా సమగ్ర విచారణ జరపాలని అధికారులను కోరుతున్నారు. ముగ్గురు అన్నదమ్ములు.. ఒకే కుటుంబం.. ఒకే తండ్రి.. కానీ ఆస్తి వివాదం మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదం, భద్రతపై ఆందోళన తనను తీవ్రంగా కుంగదీశాయని రాజన్‌బాబు చెబుతున్నారు. అందుకే మీడియా గడప తొక్కానన్నారు.

ఫిర్యాదులను పరిశీలించి, పత్రాలపై విచారణ జరపాలని రాజన్ బాబు కోరుతున్నారు. తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. చివర్లో ఆయన చేసిన విజ్ఞప్తి మరింత కలచివేసింది.. ఇక ఈ బాధను భరించలేకపోతున్నానని, ప్రాణం తీసుకునేందుకు అనుమతించండి అంటూ కన్నీటితో వేడుకున్నారు.

ఆస్తి ఎవరిది అనేది చట్టం తేల్చాల్సిందే.. ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణలో బయటపడాల్సిందే. కానీ.. 74 ఏళ్ల వృద్ధుడు న్యాయం కోసం మీడియా గడప తొక్కి. చివరకు ప్రాణం తీసుకునేందుకు అనుమతి కోరే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజన్‌బాబు చూపు అధికారుల వైపు.. ఆయనకు న్యాయం జరుగుతుందా. రక్షణ లభిస్తుందా చూడాలి..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *