Sri Mushnam Bhu Varaha Swamy Temple Telugu: తమిళనాడు గడ్డపై ఎన్నో పురాతన ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. అయితే కొన్ని క్షేత్రాలు మాత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో ‘శ్రీముష్ణం భూ వరాహస్వామి ఆలయం’ ఒకటి. ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు కూడా స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేషం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో శ్రీముష్ణం ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఏడు అంతస్తుల రాజగోపురం భక్తులకు స్వాగతం పలుకుతుంది. దేశంలోని ఎనిమిది స్వయంవ్యక్త వైష్ణవ క్షేత్రాల్లో శ్రీముష్ణం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భూ వరాహస్వామిని దర్శించుకుంటే వివాహం త్వరగా జరుగుతుందని, సంతానప్రాప్తి కలుగుతుందని, భూ సంబంధిత సమస్యలు, వాస్తుదోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
దక్షిణం వైపు తిరిగిన వరాహమూర్తి
స్థలపురాణం ప్రకారం.. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి రసాతలానికి తీసుకెళ్లాడట. భూదేవి ప్రార్థనతో శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను రక్షించాడు. మరణించే సమయంలో హిరణ్యాక్షుడు స్వామిని అనుగ్రహించమని కోరడంతో, అతడిని చూసేందుకు వరాహమూర్తి దక్షిణం వైపు తల తిప్పాడని పురాణ కథనం. అనంతరం అదే రూపంలో శ్రీముష్ణంలో స్వయంభువుగా వెలిశాడని నమ్మకం. ఈ ఆలయంలో స్వామివారి తల దక్షిణం వైపు, శరీరం పశ్చిమం వైపు ఉండటం ప్రత్యేకత. స్వామివారి దేవేరి అంబుజవల్లి తాయారు అమ్మవారిగా కొలువై ఉన్నారు. ఆలయంలోని పదహారు స్తంభాల మండపం, అద్దాల మండపం, పుష్కరిణి కూడా ప్రత్యేక ఆకర్షణలు.
వరాహ సాహెబ్‌గా కొలిచే ముస్లింలు
శ్రీముష్ణం ఆలయ ప్రత్యేకతల్లో మతసామరస్యానికి ఉన్న స్థానం ఎంతో గొప్పది. స్థానిక ముస్లింలు భూ వరాహస్వామిని ‘వరాహ సాహెబ్’గా గౌరవిస్తారు. ఒక నవాబు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగుపడిందనే స్థానిక విశ్వాసం ఈ సంప్రదాయానికి కారణంగా చెబుతారు.
ఇవి కూడా చదవండి
రథోత్సవం సమయంలో రథానికి అలంకరించే జెండాను స్థానిక ముస్లింలు సిద్ధం చేసి అందించడం ఇక్కడి సోదరభావానికి నిదర్శనం. స్వామివారి ఊరేగింపు సమయంలో స్థానిక దర్గా వద్దకు చేరుకున్నప్పుడు ముస్లింలు బియ్యం, కొబ్బరికాయలు, డ్రైఫ్రూట్స్ సమర్పిస్తారు. ఆలయ అర్చకులు దర్గాకు పట్టు శాలువా, తులసి ఆకులు అందించడం మరో విశేషం.
అంతేకాదు.. నవరాత్రి, దీపావళి, మకర సంక్రాంతి వంటి సందర్భాల్లోనూ ముస్లిం భక్తులు ఆలయంలోకి వచ్చి స్వామివారిని ఆరాధిస్తారని చెబుతారు. అందుకే శ్రీముష్ణం భూ వరాహస్వామి క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా భక్తి, విశ్వాసం, మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
(Disclaimer: ఈ కథనంలోని ఆధ్యాత్మిక విశ్వాసాలు, స్థలపురాణాలు భక్తుల నమ్మకాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. )