Headlines

Telangana: ఇక ఈ కోర్సు పూర్తిచేస్తేనే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్!

Telangana: ఇక ఈ కోర్సు పూర్తిచేస్తేనే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్!


డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం వాహనం నడపడం వచ్చిందనే కారణంతో లైసెన్స్ ఇచ్చే విధానానికి బదులుగా, రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉన్నవారికే శాశ్వత లైసెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకపై లెర్నర్ లైసెన్స్ పొందిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక రోడ్డు భద్రతా శిక్షణ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ శిక్షణ పూర్తిచేసిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్సులో ట్రాఫిక్ నిబంధనలను పుస్తకాల రూపంలో కాకుండా వీడియోల ద్వారా సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారు. రోడ్లపై ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు, ప్రమాదాలకు దారితీసే సాధారణ తప్పిదాలు, వాటిని ఎలా నివారించాలనే అంశాలను ఇందులో వివరించనున్నారు. మొత్తం ఆరు భాగాలుగా రూపొందించిన ఈ శిక్షణలో 64 రోడ్డు భద్రతా నియమాలు, 120కు పైగా వీడియోలు ఉంటాయి. ఒక్కో మాడ్యూల్ పూర్తైన తర్వాత చిన్న పరీక్ష నిర్వహిస్తారు. అన్ని మాడ్యూళ్లు విజయవంతంగా పూర్తిచేసిన వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కోర్సును తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. కెమెరా ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచే ఈ శిక్షణను పూర్తిచేయవచ్చు. ప్రారంభంలో ముఖ గుర్తింపు నమోదు తప్పనిసరి కాగా, అవసరమైతే మధ్యలో ఆపి తిరిగి కొనసాగించే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఈ శిక్షణలో కేవలం ట్రాఫిక్ రూల్స్ మాత్రమే కాకుండా సురక్షిత డ్రైవింగ్‌కు అవసరమైన అనేక అంశాలను చేర్చారు. సీట్‌బెల్ట్ వినియోగం, అద్దాల సర్దుబాటు, హ్యాండ్‌బ్రేక్ సరైన ఉపయోగం, రాత్రివేళ లైట్ల వినియోగం, ద్విచక్ర వాహనాలపై పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లే విధానం, మహిళల భద్రతకు సంబంధించిన సూచనలు కూడా ఇందులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం మానవ తప్పిదాలే కారణమవుతున్న నేపథ్యంలో కొత్త డ్రైవర్లలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సూచనల మేరకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే కూకట్‌పల్లి ఆర్టీవో పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి స్పందన లభించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *