రేపటి నుంచి ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతోంది. కొత్త నెలలో నూతన ఆర్ధిక నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ ఖాతాదారులకు సంబంధించి అనేక కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈకేవైసీ, క్రెడిట్ కార్డు నిబంధనలు, బ్యాంక్ సర్వీస్ ఛార్జీలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుంది. అలాగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగనుంది. ఆగస్ట్ నుంచి ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే ఎలాంటి మార్పులు అమల్లోకి రాబోతున్నాయనేది ఒకసారి చూద్దాం.
ఆగస్ట్ నుంచి కొత్త మార్పులు
-ఆగస్ట్ 1 నుంచి కొన్ని బ్యాంకులు సర్వీస్ ఛార్జీల్లో మార్పులు చేశాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్ఎంఎస్ ఛార్జీలను సవరించింది. ఒక్కొ మెస్సేజ్‌కు 0.3 చొప్పున వసూలు చేయనుంది.
-ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త మార్పులు రాబోతున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చెల్లించని కన్వీనియన్స్ ఫీజులు, జరిమానాలు, పన్నులను బకాయి ఉన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలను లెక్కించేటప్పుడు చేర్చకూడదు. దీని వల్ల చెల్లించని బ్యాలెన్స్‌లను ముందుకు తీసుకువెళ్లే కస్టమర్లకు రివాల్వింగ్ క్రెడిట్ ఖర్చు తగ్గుతుంది. ఇక కొన్ని బ్యాంకులు ఆగస్టు నుండి క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, వార్షిక ఫీజులు, ఇతర ఛార్జీల్లో మార్పులు చేస్తున్నాయి.
-కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ఈకేవైసీ వ్యవస్థ 2.0ను ఆగస్ట్ నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రతీసారి కేవైసీ కోసం ఆధార్, పాన్ లాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. మీ సమ్మతితో బ్యాంకులు ఆటోమేటిక్‌గా సెంట్రలైజ్డ్ డేటా బేస్ నుంచి వివరాలను తీసుకుని కేవైసీ పూర్తి చేస్తాయి. గుర్తింపు ధృవీకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్, బ్రోకరేజీ, ఇతర ఆర్ధిక సంస్థలు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అవుతాయి. కేవైసీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. బీమా సంస్థలు కూడా రాబోయే రోజుల్లో ఇందులో చేరనున్నాయి. ఇప్పటివరకు కేవైసీ ప్రక్రియ చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం తగ్గి నిమిషాల్లోనే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
-ఇక ఆగస్ట్ 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగనుంది. ఆగస్ట్ 5న ఆర్బీఐ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. వడ్డీ రేట్లు, ద్రవ్య లభ్యత పరిస్థితులపై ఆర్బీఐ తన విధానాన్ని ప్రకటించనుంది. వడ్డీ రేట్లలో సవరణలు జరిగితే రుణ రేట్లు, రుణాల ఈఎంఐలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభావితం చూపిస్తాయి.