సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతోందో, దాన్ని అక్రమ మార్గాల్లో వాడే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. తాజాగా దక్షిణ కొరియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత కఠినమైన జాతీయ ట్యాక్స్ అకౌంటెంట్ అర్హత పరీక్షలో టాపర్గా నిలిచిన హాన్ అనే అభ్యర్థి, తాను ఏఐ సాయంతో చీటింగ్ చేసి ఈ విజయం సాధించానని స్వయంగా అంగీకరించడం సంచలనంగా మారింది. ఏప్రిల్, జులై నెలల్లో జరిగిన ఈ పరీక్షల్లో హాన్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా మొదటి రౌండ్లో 400 మార్కులకు గాను ఏకంగా 397.5 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం 160 ప్రశ్నలకు 159 సరైన సమాధానాలు రాయడంతో పరీక్షా నిర్వాహకులకు, తోటి అభ్యర్థులకు అతనిపై అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాన్ ఆదివారం ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియో ద్వారా తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రత్యేకమైన ఏఐ గ్లాసెస్ ధరించి వెళ్లానని, వాటి ద్వారా ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి ఏఐ టూల్ సాయంతో ఫోన్కు పంపి సమాధానాలు రాశానని అతను వివరించాడు. తాను నిజాయతీగా విజయం సాధించలేదని, అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన న్యాయవాది ద్వారా సియోల్ పోలీసులకు లిఖితపూర్వక వాంగ్మూలం కూడా సమర్పించాడు. ఈ గురువారం దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన వార్షిక కాలేజీ ప్రవేశ పరీక్షలు జరగనున్న తరుణంలో ఈ ఘటన బయటపడటంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అధ్యక్ష భవనం ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి హైటెక్ మోసాలకు తావులేకుండా అత్యవసర చర్యలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులినే పరుగులు పెట్టించిన మంత్రి… ఆ తర్వాత!
కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు
ఎవర్రా మీరు… సింహాన్నే హడలెత్తించారుగా
కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !
అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!