Headlines

40 ఏళ్ల తర్వాత కూడా తల్లులు అవుతున్న హీరోయిన్లు.. బయోలాజికల్ క్లాక్ నిజంగానే ఆగిపోయిందా?


ఒకప్పుడు మహిళలు 30 ఏళ్లు దాటితే పెళ్లి, పిల్లల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా 35 ఏళ్లు దాటితే తల్లయ్యే అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కెరీర్, ఆర్థిక స్వతంత్రం, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తున్న మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం సాధారణంగా మారింది. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా 40 ఏళ్ల తర్వాత మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో అసలు మహిళల్లో బయోలాజికల్ క్లాక్ అనేది నిజంగానే పనిచేస్తుందా? 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా సహజంగా గర్భం దాల్చడం సాధ్యమేనా? అనే చర్చ మొదలైంది.

గతంలో మహిళలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే అభిప్రాయం బలంగా ఉండేది. కానీ ఇప్పుడు చదువు, ఉద్యోగం, కెరీర్, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ జీవితంలో సరైన సమయం వచ్చినప్పుడే మాతృత్వాన్ని స్వీకరించాలని భావిస్తున్నారు. దీంతో ఆలస్యంగా పిల్లల్ని కనడం పట్ల సమాజంలోనూ అవగాహన పెరుగుతోంది. హాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమల్లో 40 ఏళ్ల తర్వాత తల్లులైన సెలబ్రిటీల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. ప్రియాంక చోప్రా 39 ఏళ్ల వయసులో సరోగసీ ద్వారా తల్లయ్యారు. కరీనా కపూర్ ఖాన్ తన రెండో బిడ్డకు 40 ఏళ్ల వయసులో జన్మనిచ్చారు. హిల్లరీ స్వాంక్ 48 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చారు. ఇలాంటి ఉదాహరణలు ఆలస్యంగా మాతృత్వాన్ని స్వీకరించాలనుకునే మహిళలకు కొత్త ఆలోచనలను కలిగిస్తున్నాయి.

అసలు బయోలాజికల్ క్లాక్ అంటే ఏమిటి?

మహిళల సంతానోత్పత్తి సామర్థ్యం వయసుతో పాటు మారుతూ ఉంటుంది. దీనినే సాధారణంగా బయోలాజికల్ క్లాక్ లేదా ఓవేరియన్ ఏజింగ్ అంటారు. మహిళలు పుట్టుకతోనే నిర్దిష్ట సంఖ్యలో అండాలను కలిగి ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి సంఖ్య తగ్గుతుంది. అంతేకాదు మిగిలిన అండాల నాణ్యత కూడా క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఈ మార్పులు వేగంగా కనిపించే అవకాశం ఉంటుంది. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు గర్భం దాల్చడం కష్టమవుతుందని చెప్పలేం. అయితే ఈ వయసు తర్వాత సంతానోత్పత్తి అవకాశాలు క్రమంగా తగ్గుతాయి. అండాల నాణ్యత తగ్గడం వల్ల ఫలదీకరణ సమస్యలు, గర్భస్రావం, క్రోమోజోమ్ సంబంధిత సమస్యల ముప్పు పెరగవచ్చు. అందుకే ఈ వయసులో గర్భధారణ గురించి ఆలోచిస్తున్న మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రస్తుతం మహిళలకు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాల్లో ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి. ఇందులో మహిళల అండాలను సేకరించి తక్కువ ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమైనప్పుడు వాటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే మహిళలు ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎగ్ ఫ్రీజింగ్ భవిష్యత్తులో తప్పనిసరిగా బిడ్డ పుడుతుందనే హామీ కాదు.

సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులకు ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య విధానాలు ఆశ కల్పిస్తున్నాయి. ఈ ప్రక్రియలో అండం, వీర్యకణాన్ని ల్యాబ్‌లో ఫలదీకరించి పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అవసరాన్ని బట్టి డోనర్ ఎగ్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో సరోగసీ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అయితే ప్రతి మహిళకు ఒకే విధానం సరిపోదు. వైద్యుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి. 40 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం అసాధ్యమేమీ కాదు. అయితే ఈ వయసులో గర్భధారణ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు, ప్రీక్లాంప్సియా, గర్భస్రావం, నెలలు నిండకముందే ప్రసవం వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. అందుకే గర్భధారణకు ముందే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, గర్భం దాల్చిన తర్వాత క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అవసరం.

ఆలస్యంగా తల్లైతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలా?

ఆలస్యంగా గర్భం దాల్చిన ప్రతి మహిళకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకోవడం తప్పు. అయితే గర్భధారణ సమయంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ప్రసవం తర్వాత కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన మహిళలకు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు. అలాగే అధిక రక్తపోటు సమస్యలు కూడా దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే ప్రసవం తర్వాత కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

మహిళలు ముందుగానే చేయించుకోవాల్సిన పరీక్షలేంటి?

భవిష్యత్తులో పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్న మహిళలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇందుకోసం వైద్యులు అవసరాన్ని బట్టి ఏఎంహెచ్ (AMH) రక్త పరీక్షను సూచించవచ్చు. ఇది అండాల నిల్వకు సంబంధించిన అంచనాను అందిస్తుంది. అలాగే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ (AFC) అల్ట్రాసౌండ్ ద్వారా అండాశయాల్లోని చిన్న ఫాలికల్స్ సంఖ్యను పరిశీలిస్తారు.

సెలబ్రిటీలను చూసి నిర్ణయాలు తీసుకోవద్దు!

హీరోయిన్లు 40 ఏళ్ల తర్వాత తల్లులవుతున్నారనే వార్తలు చూసి ప్రతి మహిళ కూడా అదే విధంగా గర్భం దాల్చగలదని భావించకూడదు. వారి వ్యక్తిగత వైద్య పరిస్థితులు, సంతానోత్పత్తి చికిత్సలు, అండాల భద్రపరచడం వంటి వివరాలు చాలాసార్లు బయటకు రావు. అందుకే సెలబ్రిటీల జీవితాలతో తమ ఆరోగ్యాన్ని పోల్చుకోవడం సరికాదు. మాతృత్వానికి సరైన సమయం అనేది ప్రతి మహిళకు భిన్నంగా ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, మానసిక సంసిద్ధత, వైద్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *