Headlines

స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్


ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇకపై గేరు మార్చకపోతే నష్టం తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓట్ శాతం మరింత పెరగాలని నిర్దేశించిన చంద్రబాబు..ఓటు శాతం తగ్గితే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయనట్టేనని హెచ్చరించారు.

ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో సంబంధాలు వంటి అంశాలతో ఎమ్మెల్యే పనితీరును అంచనా వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని కూడా కీలక కొలమానంగా ముందుకు తెచ్చారు చంద్రబాబు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే తమ నియోజకవర్గాల్లో ఎక్కడ బలం ఉంది? ఎక్కడ బలహీనత ఉంది? ఏ వర్గం పార్టీకి దూరంగా ఉంది? ఏ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించడంలో ఆలస్యం చేయకూడదన్నారు చంద్రబాబు. అదే సమయంలో ప్రత్యర్థుల నుంచి వచ్చే అసత్య ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఒకసారి తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్తే సరిచేయడం కష్టమవుతుందని, అందుకే తప్పుడు ప్రచారాన్ని పార్టీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియా వేదికలను ప్రత్యర్థులకు వదిలేస్తే పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు 10 సూత్రాలు

  • స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓట్ శాతం పెరగాలి
  • ఓట్ శాతంపైనే ఎమ్మెల్యేల భవిష్యత్
  • ప్రతిపక్షాల ఫేక్‌ ప్రచారాన్ని ఖండించాలి
  • ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది
  • కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేయాలి
  • ఇప్పుడే ఎన్నికలు జరిగినా విజయం ఎన్డీఏదే
  • సమర్థవంతమైన మహిళా నేతలను గుర్తించాలి
  • నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
  • టెక్నాలజీని నిర్లక్ష్యం చేస్తే అవుట్‌డేటెడ్ అయిపోతారు
  • ఎమ్మెల్యేలు కమ్యూనికేషన్ స్కిల్ మరింత పెంచుకోవాలి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు . ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కాన్‌క్లేవ్‌ ప్రధాన ఉద్దేశం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *