Headlines

సత్యం కోసం సర్వస్వం త్యాగం.. హరిశ్చంద్రుడి కథ మనకు చెప్పే జీవిత పాఠాలు


భారతీయ పురాణాల్లో సత్యనిష్ఠ, ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహారాజు హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని, సంపదను, చివరకు భార్యాబిడ్డలను సైతం కోల్పోయినా ఇచ్చిన మాట కోసం అసత్యం పలకని గొప్ప వ్యక్తి ఆయన. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం, సత్య మార్గాన్ని విడిచిపెట్టకూడదని ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. మార్కండేయ పురాణంలో ప్రస్తావించిన హరిశ్చంద్రుడి కథలో ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ఘట్టాలు ఉన్నాయి.

హరిశ్చంద్రుడు సూర్యవంశానికి చెందిన గొప్ప రాజు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధంగా పాలన సాగించేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నమ్మేవాడు. అలాంటి హరిశ్చంద్రుడి సత్యనిష్ఠను స్వయంగా పరీక్షించాలని మహర్షి విశ్వామిత్రుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజు దగ్గరకు వెళ్లి ఆయన మొత్తం రాజ్యాన్ని దానంగా ఇవ్వాలని అడిగాడు. ఇచ్చిన మాట ప్రకారం హరిశ్చంద్రుడు ఏమాత్రం వెనుకాడకుండా తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించాడు.

అయితే రాజ్యాన్ని దానం చేసిన తర్వాత కూడా విశ్వామిత్రుడు దక్షిణ చెల్లించాలని కోరాడు. దక్షిణ చెల్లించడానికి తన దగ్గర ఏమీ లేకపోవడంతో హరిశ్చంద్రుడు భార్య శైబ్య (చంద్రమతి), కుమారుడు రోహితాశ్వుడితో కలిసి అయోధ్యను విడిచిపెట్టాడు. విశ్వామిత్రుడికి ఇవ్వాల్సిన దక్షిణ కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తన భార్యను, కుమారుడిని సేవకులుగా ఓ ఇంటి యజమానికి విక్రయించాడు.

ఇవి కూడా చదవండి



తాను కూడా కాశీలోని శ్మశానంలో పనిచేసే వ్యక్తికి అమ్ముడుపోయాడు. అక్కడ శ్మశానంలో పనిచేస్తూ, అంత్యక్రియల కోసం వచ్చే ప్రతి కుటుంబం నుంచి రుసుము వసూలు చేయడం ఆయన బాధ్యతగా మారింది. రాజుగా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి.. విధి ఆడిన వింత నాటకంలో శ్మశానంలో కాటికాపరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సొంత కుమారుడు మరణించినా..

హరిశ్చంద్రుడి జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఆయన కుమారుడు రోహితాశ్వుడి మరణం. పాముకాటుకు గురై కుమారుడు మరణించడంతో భార్య చంద్రమతి అతడి మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి చేరుకుంది. అక్కడ కాటికాపరిగా పనిచేస్తున్న హరిశ్చంద్రుడు తన భార్యను గుర్తించినప్పటికీ, విధి నిర్వహణలో భాగంగా అంత్యక్రియలకు రుసుము చెల్లించాలని కోరుతాడు. తన సొంత కుమారుడి అంత్యక్రియల విషయంలోనూ యజమాని ఆదేశాలకు కట్టుబడి తన బాధ్యతను విస్మరించలేదు. ఈ సంఘటన హరిశ్చంద్రుడి సత్యనిష్ఠకు, కర్తవ్యపాలనకు పరాకాష్టగా నిలుస్తుంది. అటు భర్తగా, ఇటు తండ్రిగా ఎంతటి బాధను అనుభవించినా తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు.

హరిశ్చంద్రుడి జీవితంలో ఎదురైన పరీక్షలన్నీ ఒక గొప్ప పరీక్షలో భాగమని చివరకు దేవతలు ప్రత్యక్షమై తెలియజేస్తారు. ఆయన సత్యనిష్ఠకు, ధర్మబద్ధతకు మెచ్చి కుమారుడు రోహితాశ్వుడికి తిరిగి ప్రాణం పోస్తారు. కోల్పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి ప్రసాదిస్తారు. ఇలా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా సత్యాన్ని విడిచిపెట్టని హరిశ్చంద్రుడు గొప్ప గౌరవాన్ని పొందుతాడు.

హరిశ్చంద్రుడి కథ మనకు చెప్పే జీవిత పాఠాలు

హరిశ్చంద్రుడి కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాల్సిన కొన్ని విలువలను గుర్తుచేస్తుంది.

  • నిజాయితీకి పరీక్షలు తప్పవు: పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండటం సులభం. కష్టాలు ఎదురైనప్పుడే మన వ్యక్తిత్వం బయటపడుతుంది.
  • ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్యం: ఫలితం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించకుండా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే నిష్కామ కర్మ సూత్రాన్ని ఈ కథ గుర్తుచేస్తుంది.
  • ఇచ్చిన మాటకు విలువ ఇవ్వాలి: ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం.
  • ధర్మ ఆచరణ సులభమైన మార్గం కాదు: కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ న్యాయం, ధర్మం వైపు నిలబడాలనే సందేశాన్ని హరిశ్చంత్రుడి గాథ అందిస్తుంది.

నేటి జీవితంలోనూ హరిశ్చంద్రుడి సత్యనిష్ఠ అవసరమే!

హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయేంత పెద్ద పరీక్షను ఎదుర్కొన్నాడు. మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎదురుకాకపోవచ్చు. కానీ ఎవరూ చూడనప్పుడు నిజం చెప్పడం, చేసే పనిలో నిజాయితీగా ఉండటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వంటి చిన్న చిన్న సందర్భాల్లో మన వ్యక్తిత్వం బయటపడుతుంది. హరిశ్చంద్రుడి కథలోని అసలైన సందేశం కూడా ఇదే. మనల్ని ఎవరూ గమనించకపోయినా మనం చేసే పనిలో నిజాయితీగా ఉండటమే నిజమైన ధర్మం.

(గమనిక: సత్య హరిశ్చంద్రుడి గాథ పురాణ, ప్రాంతీయ సంప్రదాయాల్లో వివిధ రూపాల్లో ప్రచారంలో ఉంది. దీనిని చారిత్రక సంఘటనగా కాకుండా ధార్మిక, నైతిక కథగా చూడాలి)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *