హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 07) చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడిన మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ.. ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు.
శాసనసభలోకి వెళ్లే సమయంలో మహిళా శాసనసభ్యులతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ఈ క్రమంలో తనపై కూడా దాడి జరిగిందని, తన షర్టు, ఫ్యాంటు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించినట్లు అనిపించిందని పేర్కొన్నారు. కొంతమంది తనను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురై.. తనపై దాడి చేసింది ఎవరు? తన షర్టు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు? అలా చేయమని ఎవరు ఆదేశించారు? అంటూ తాను ప్రశ్నించినట్లు తాటా మధు వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలను స్పీకర్ను ఉద్దేశించి చేసినవిగా భావించడం సరికాదని స్పష్టం చేశారు.
స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తాటా మధు తెలిపారు. స్పీకర్ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏదైనా స్పీకర్ను ఉద్దేశించినట్లు భావిస్తే.. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
శాసనసభలోకి వెళ్లే సమయంలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై తాటా మధు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా శాసనసభ్యులతో తోపులాట జరిగిందని, వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తమ సీనియర్ నాయకులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో వ్యవహరించే విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
శాసనసభ్యులపై జరిగినట్లు పేర్కొన్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించాలని తాటా మధు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలపై ఏర్పడిన వివాదం కంటే.. శాసనసభలో చోటుచేసుకున్న అసలు పరిణామాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తాటా మధు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనలపై సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాటా మధు ఇచ్చిన తాజా వివరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు లేఖ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..